మహా కుంభమేళా, భక్తులకే కాదు, వ్యాపారస్తులకు కూడా అపారమైన ఆదాయాన్ని అందించే అవకాశాన్ని కల్పిస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఇటీవల జరిగిన కుంభమేళాలో ఇదే రీతిలో ఓ కుటుంబం అద్భుతమైన లాభాలను సొంతం చేసుకుంది. అరైల్ గ్రామానికి చెందిన పింటూ మహ్రా కుటుంబం, త్రివేణి సంగమ వద్ద 45 రోజుల పాటు 130 బోట్లను నడిపి దాదాపు రూ. 30 కోట్లు సంపాదించింది. సాధారణంగా రోజుకు కొన్ని వందల రూపాయల కోసం శ్రమించే వారి కోసం ఇది పెద్ద అదృష్టం. కానీ అనూహ్యంగా ఈ సంపద ఇప్పుడు వారికి తలనొప్పిగా మారింది.
అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ వ్యవహారాన్ని ప్రస్తావించడంతో, ఈ విషయం సామాన్య ప్రజల దృష్టికి వచ్చింది. అప్పటివరకు ప్రశాంతంగా సాగిన పింటూ కుటుంబ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఈ వార్త వైరల్ కావడంతో ఆదాయపన్ను శాఖ కూడా స్పందించింది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, పింటూ కుటుంబానికి రూ. 12.8 కోట్లు పన్నుగా చెల్లించాలంటూ నోటీసులు జారీ అయ్యాయి. ఇది ఒక్కసారిగా వారి జీవితంలో ఊహించని మార్పును తీసుకువచ్చింది.
పెరిగిన ఆదాయం, ఆర్థికంగా బలపడిన అనుభూతి తక్కువ కాలం మాత్రమే ఆనందాన్ని అందించింది. పింటూ కుటుంబం రోజుకు కొన్ని వందల రూపాయలకే బోట్లను నడిపేది. కానీ కుంభమేళా సమయంలో అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఒక్కో బోట్ రైడ్‌కు రూ. 1000 వరకు వసూలు చేయగలిగారు. తాత్కాలికంగా వచ్చిన ఈ అదృష్టం, వారు అనుకున్నంత సులభం కాదని ఆలస్యంగా తెలిసింది. సాధారణంగా పెద్ద వ్యాపారులు, సంస్థలు తమ ఆదాయంపై పన్ను చెల్లించడంలో అనుభవం కలిగి ఉంటారు. కానీ పింటూ లాంటి వారికి ఇటువంటి అనుభవం లేకపోవడంతో ఇప్పుడు వారు పన్ను రుసుము చెల్లించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ సంఘటన ద్వారా అనేక విషయాలు స్పష్టమవుతున్నాయి. ప్రభుత్వానికి తెలియకుండా వచ్చిన ఆదాయాన్ని ఉపయోగించుకోవడం ఎంత ప్రమాదకరమో ఇది తేటతెల్లం చేసింది. పింటూ కుటుంబం లాంటి చిన్న వ్యాపారస్తులకు అకస్మాత్తుగా వచ్చిన ఆదాయంపై తగిన అవగాహన లేకపోవడం, వారు ఆర్థికంగా ఇంకా కుదుటపడకముందే పన్ను భారం మోపబడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన భవిష్యత్తులో ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకునే ఇతర చిన్న వ్యాపారులకు ఒక గుణపాఠంగా నిలవనుంది.