అమెరికాలో చదువుకున్న విదేశీ విద్యార్థులకు OPT (ఆప్టికల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) అనేది ఒక ప్రత్యేకమైన అవకాశం. అంటే, వారు తమ చదువు పూర్తయ్యాక 1 నుంచి 3 సంవత్సరాల పాటు అక్కడే ఉండి అనుభవాన్ని సంపాదించుకోవచ్చు. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ కోర్సులు చేసిన వారికి మొత్తం 3 ఏళ్లు ఈ అవకాశం ఉంటుంది. కానీ, తాజాగా USCIS (యునైటెడ్ స్టేట్స్ సిటీజేన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్) కొత్త పాలసీ కారణంగా OPT స్కామ్‌లో ఇరుక్కున్న విద్యార్థులు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు.
OPT స్కామ్ ఎలా జరుగుతుందంటే, కొన్ని కన్సల్టింగ్ కంపెనీలు విద్యార్థులకు మంచి ఉద్యోగం ఇస్తామంటూ నమ్మిస్తాయి. ఆ తర్వాత, ఉద్యోగం కోసం ఇంకా కొంత శిక్షణ కావాలని చెబుతూ డబ్బు వసూలు చేస్తాయి. కానీ, అసలు పనిచేయడానికి ఎలాంటి ప్రాజెక్ట్‌లు ఇవ్వకుండా, కేవలం డాక్యుమెంట్స్‌లో మాత్రమే ఉద్యోగం ఉన్నట్లు చూపిస్తాయి. ఈ క్రమంలో కొందరు ఇల్లీగల్ గా పార్ట్ టైమ్ జాబ్స్ లలో కొనసాగుతూ ఉంటారు.
ఇక OPT స్కామ్ పై అనుమానాల వలన డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ (DHS) సంస్థ గుర్తించి, ఆ కంపెనీలపై దాడులు చేసింది. తర్వాత, ఆ కంపెనీలలో పని చేసిన విద్యార్థుల పేర్లను USCIS తన లిస్టులో చేర్చింది. ఈ నేపథ్యంలో, చాలా మంది భారతీయ విద్యార్థులు OPT పూర్తయి, ఇప్పుడు H-1B వీసాపై ఉన్నప్పటికీ, భారత్ నుంచి తిరిగి అమెరికాకు వెళ్లినప్పుడు వారి వీసాలను రద్దు చేస్తున్నారు. అమెరికాలోని పలు ఇమ్మిగ్రేషన్ అధికారుల టీమ్స్ వారి పేరు OPT స్కామ్‌లో ఉందని చెబుతూ, వారిని తిరిగి భారత్‌కు పంపేస్తున్నాయి. అంతేకాదు, అలాంటి విద్యార్థులకు భవిష్యత్తులో అమెరికా వీసా కూడా ఇవ్వకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఈ సమస్య నుంచి బయటపడటానికి, విద్యార్థులు తక్షణమే న్యాయ సహాయం తీసుకోవాలి. తమ పేరు USCIS రికార్డుల నుండి తొలగించుకోవడానికి లీగల్ ప్రొసెస్ ద్వారా ముందుకు వెళ్లాలని ఇమ్మిగ్రేషన్ నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే, OPT స్కామ్ కారణంగా విద్యార్థులు, యువ ఉద్యోగులు తమ అమెరికా కెరీర్‌ను కోల్పోయే ప్రమాదం ఉంది. తప్పుడు కంపెనీలలో పనిచేయడం వల్ల ఎంతటి ఇబ్బందులు రావొచ్చో ఇప్పుడు అందరికీ అర్థమయ్యేలా మారింది. కనుక, OPT కోసం పని చేసే ముందు ఎప్పుడూ ధృవీకరించిన కంపెనీలను మాత్రమే ఎంచుకోవడం చాలా ముఖ్యం.