మహా కుంభమేళ : పడవలు నడిపి 30కోట్లు సంపాదించారు

ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన కుంభమేళా దేశవ్యాప్తంగా విశేష చర్చనీయాంశంగా మారింది. కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా, ఆర్థికంగా కూడా భారీ స్థాయిలో లాభాలను తెచ్చిపెట్టింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివరణ ప్రకారం, ఈ ఉత్సవం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలిగిందని.. ప్రధానంగా, కుంభమేళా వల్ల పలు రంగాల్లో వాణిజ్యం విస్తరించి, వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగినట్లు అంచనా వేశారు.

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ప్రకారం, కుంభమేళా నిర్వహణకు రూ.7,500 కోట్లు ఖర్చు చేయగా, దీని ద్వారా దాదాపు రూ.3 లక్షల కోట్ల వాణిజ్య లావాదేవీలు జరిగాయి. హోటల్ పరిశ్రమలో రూ.40 వేల కోట్ల మేర ఆదాయం సమకూరగా, ఆహార మరియు నిత్యావసర వస్తువుల రంగంలో రూ.33 వేల కోట్లు వచ్చాయని తెలుస్తోంది. రవాణా రంగానికి కూడా భారీగా లాభం కలిగిందని, దాదాపు రూ.1.5 లక్షల కోట్ల మేర ఆదాయం సాధించినట్లు అధికారులు తెలిపారు.

కేవలం ప్రభుత్వ స్థాయిలోనే కాకుండా, వ్యక్తిగత స్థాయిలోనూ చాలా మంది ఆర్థికంగా లాభపడ్డారు. ముఖ్యంగా ఒక కుటుంబం 130 పడవలను నడిపించి రూ.30 కోట్ల మేర ఆదాయం సంపాదించిందని సీఎం యోగి ప్రకటించారు. ఒక్క పడవ ద్వారా రోజుకు రూ.52 వేల వరకు ఆదాయం రాగా, 45 రోజుల్లో ప్రతి పడవకు దాదాపు రూ.23 లక్షల వరకు లాభం వచ్చిందని వివరించారు.

సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించినట్లుగా పడవ నడిపే వారు దోపిడీకి గురయ్యారనే వ్యాఖ్యలను సీఎం ఖండించారు. ప్రజల ఆదాయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని, ఉత్సవం విజయవంతంగా ముగిసిందని స్పష్టం చేశారు. పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లతో 45 రోజులపాటు జరిగిందని అన్నారు. ఇక కుంభమేళా దేశ జీడీపీ వృద్ధికి దోహదపడిన పెద్ద కార్యంగా ప్రభుత్వం భావిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6.5% వృద్ధికి ఇది తోడ్పడుతుందని యోగి అభిప్రాయపడ్డారు.