అమెరికా నుంచి భారత్‌కు ఒక కారు దిగుమతి చేసుకుంటే, దాని ధర 10 లక్షలు అయితే, భారత ప్రభుత్వం 100% టారిఫ్ పన్ను విధిస్తే, కస్టమర్ ఆ కారును 20 లక్షలకి కొనాల్సి వస్తుంది. ఇలా చేస్తే, స్థానికంగా తయారయ్యే కార్ల కొనుగోలు పెరిగి, భారత్ కు లాభం కలుగుతుంది. ఇప్పుడు ట్రంప్ కు ఇదే నచ్చడం లేదు. డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య రంగంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాలు అమెరికాపై ఎంత శాతం టారిఫ్‌లు (ఆంక్షలు) విధిస్తే, తాము కూడా అదే స్థాయిలో విధిస్తాము అని స్పష్టం చేశారు.
ఈ వ్యాఖ్యలతో భారత్, చైనా, యూరోపియన్ యూనియన్, బ్రెజిల్, దక్షిణ కొరియా వంటి దేశాలపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు స్పష్టమవుతోంది. ఏప్రిల్ 2 నుంచి రెసిప్రోకల్ టారిఫ్ విధానం అమల్లోకి వస్తుందని ఆయన ప్రకటించారు. ట్రంప్ ప్రకటనలో భారత్ ప్రత్యేకంగా ప్రస్తావనకు రావడం గమనార్హం. అమెరికా ఉత్పత్తులపై భారత్ 100% టారిఫ్ విధిస్తోందని, చైనా టారిఫ్‌లు అమెరికా కంటే రెండింతలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు.
దక్షిణ కొరియా మరింత ఎక్కువగా నాలుగు రెట్లు అధికంగా టారిఫ్‌లు వసూలు చేస్తోందని ఆరోపించారు. ఇతర దేశాలు అమెరికా ఉత్పత్తులను కేవలం ఆర్థిక పరమైన ఆంక్షల ద్వారా మాత్రమే కాదు, అనేక రకాల పరిమితుల ద్వారా కూడా నిరోధిస్తున్నాయని విమర్శించారు. దీనికి ప్రతిస్పందనగా అమెరికా కూడా తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
ఇంతవరకు ట్రంప్ తీరును పరిశీలిస్తే, ఆయన పరిపాలనలో అమెరికా ఫస్ట్ విధానం మళ్లీ కొనసాగుతుందని అర్థమవుతోంది. స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ, విదేశీ ఉత్పత్తులపై కఠిన ఆంక్షలు విధించాలనే యత్నం చేయడం కొత్తేమీ కాదు. అయితే, గతంలో భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు, పన్ను విధానాల్లో మార్పులు చోటుచేసుకున్నా, ట్రంప్ తాజా ప్రకటనతో పరిస్థితి మళ్లీ వాణిజ్య యుద్ధం వైపు దారి తీసే అవకాశం కనిపిస్తోంది.
ఈ సందర్భంగా ట్రంప్ గత డెమోక్రటిక్ పాలనను విమర్శించారు. గత ప్రభుత్వం వల్లే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, 48 ఏళ్లలో అతిపెద్ద ద్రవ్యోల్బణం ఎదుర్కొన్నామని, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. స్థానిక ఉత్పత్తులపై పన్ను తగ్గింపులు, కార్ల రుణాలపై వడ్డీలకు ట్యాక్స్ మినహాయింపులు వంటి ఆలోచనలు కూడా వెల్లడించారు. అయితే, ఇవన్నీ అమెరికాలో తయారైన ఉత్పత్తులకే వర్తిస్తాయని స్పష్టం చేశారు.
మొత్తానికి, ట్రంప్ తాజా విధానం భారత్ సహా పలు దేశాలకు పెద్ద సవాలుగా మారనుంది. భారత్ ప్రస్తుతం అమెరికాతో మంచి వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్నా, ఈ టారిఫ్‌ల విధానం వల్ల గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశముంది. భారత్ ఇప్పటికే అమెరికా నుంచి దిగుమతులు చేసుకునే వస్తువులపై పన్నులను తగ్గించిందని తెలుస్తోంది. కానీ ట్రంప్ పాలనలో మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.