భారతదేశంలో పెట్టుబడుల ప్రవాహం కొత్త గమ్యస్థానాలను ఆకర్షిస్తోంది. తెలంగాణ తర్వాత మహారాష్ట్రలో కూడా అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) భారీ పెట్టుబడులు పెట్టనుంది. రూ.68 వేల కోట్లతో (8.2 బిలియన్ డాలర్లు) మహారాష్ట్రలో AWS డేటా సెంటర్ల విస్తరణను ప్రకటించింది. ఇదే తరహాలో ఇటీవలే తెలంగాణకు కూడా రూ.60 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ రెండు రాష్ట్రాలు వరుసగా ప్రపంచస్థాయి కంపెనీలను ఆకర్షించడంలో విజయం సాధించాయి.
అయితే ఆంధ్రప్రదేశ్ కు ఇలాంటి పెట్టుబడులు ఎప్పుడు వస్తాయి అనేది అసలు ప్రశ్న. కూటమి ప్రభుత్వం అభివృద్ధిపై పూర్తిగా దృష్టి పెట్టింది. సీఎం చంద్రబాబు నాయుడు గత అనుభవాన్ని ఉపయోగించి రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. హైడ్రోజన్ ఎనర్జీ నుంచి, గ్రీన్ ఇండస్ట్రీలు, ఐటీ పార్క్‌ల వరకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కానీ, పెట్టుబడులు ఆకర్షించడానికి సరైన పారదర్శక విధానాలు, ప్రణాళికలు, విధివిధానాలు అవసరం.
గతంలో వైసీపీ హయాంలో లులూ మాల్ ప్రాజెక్ట్ రద్దు కావడం, కొన్నిరకాల వ్యాపార పెట్టుబడులు వెనుకబడడం ఏపీకి ప్రతికూలంగా మారింది. AWS లాంటి కంపెనీ ఏపీకి వస్తే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. డేటా సెంటర్ లాంటి పెద్ద ప్రాజెక్టులు ఒకసారి ఎక్కడైతే స్థాపించబడతాయో, అక్కడ మరికొన్ని కంపెనీలు సహజంగానే వస్తాయి. ఇది ఇతర ఐటీ కంపెనీలను, స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను మరింత పురోగమించేలా చేస్తుంది.
హైదరాబాద్ నేడు ఐటీ హబ్‌గా ఎదగడానికి గల ప్రధాన కారణం మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ మొదలైన కంపెనీల పెట్టుబడులు. అలాంటి స్థాయిలో ఏపీలోనూ పెట్టుబడులు రావాలంటే, ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలి.అయితే గత ఏడాది లోకేష్ అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ అమెజాన్ ఇన్వెస్టర్లతో చర్చలు జరిపారు.
అయితే సమీప భవిష్యత్తులో మాత్రం AWS వంటి కంపెనీలు ఏపీ వైపు కూడా చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం, అమరావతి వంటి ప్రాంతాలు ఐటీ హబ్‌గా ఎదగడానికి అవకాశం ఉంది. అయితే, ఈ అవకాశాన్ని ప్రభుత్వం ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి. సరైన విధానాలను తీసుకురాగలిగితే, ఏపీ మరో ఐటీ డెస్టినేషన్‌గా మారవచ్చు.