పేరే పెట్టుబడి.. కటకటాల్లోకి ‘సుల్తాన్’ రాజా

నిజమే.. అతడో వైద్యుడు. సర్కారీ గుర్తింపు ఉన్న వైద్య కళాశాలలోనే వైద్య విద్యను అభ్యసించాడు. వైద్య వృత్తినీ ప్రారంభించాడు. సొంత రాష్ట్రం తమిళనాడు వదిలేసి… తెలంగాణ చేరుకున్నాడు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని జనగామ పట్టణంలో ఏకంగా ఆసుపత్రినే తెరిచాడు. ప్రాక్టీస్ బాగానే సాగుతోంది. తన పేరు చివరలోని రెండు పదాలు అతడిని బాగా టెంప్ట్ చేసినట్టున్నాయి. ఆ పేర్లనే పెట్టుబడిగా ఎందుకు పెట్టకూడదు అని అతడు ఆలోచించాడు. ఆ తర్వాత ఆలోచనను అమలులో పెట్టేశాడు.

చికిత్స కోసం తన వద్దకు వచ్చిన వారికి తన పేరును గుర్తు చేస్తూ తానో రాజవంశానికి చెందిన వాడినని… తనకు వేల కోట్ల రూపాయల ఆస్తులున్నాయని చెప్పడం ప్రారంభించాడు. నిజమే కదా అంటూ… ఆ వైద్యుడి పేరు తరచి చూసిన వారంతా అతడు చెప్పే మాటలు నిజమేనని నమ్మడం ప్రారంభించారు. అప్పుడు అతడు తన సిసలైన ప్లాన్ ను బయటకు తీశాడు. తాము ఆ రాజవంశానికి చెందిన వారసుడి వద్ద చికిత్స చేయించుకుంటున్నామని గర్వంగా ఫీల్ అయ్యారు. ఆపై అతడు అడిగిందే తడవుగా కోటి, కోటిన్నర చొప్పున సమర్పించుకున్నారు.

ఇంకేం తాను అనుకున్న పథకం వర్కవుట్ అయ్యింది కదా అని భావించిన జనగాం వైద్యుడు అబ్దుల్ రహీమ్ సుల్తాన్ రాజా రూ.5.56 కోట్లతో ఉడాయించాడు. తమిళనాడులోని కుమ్మం ప్రాంతానికి చెందిన వాడైన రాజా… తాను టిప్పు సుల్తాన్ వారసుడినని, కర్ణాటక సర్కారు తన ట్రస్టుకు రూ.700 కోట్ల నిధులను ఇస్తోందని… ఆ డబ్బుతో హైదరాబాద్ లో మంచి ఆసుపత్రిని కడతానని చెప్పేవాడు. హైదరాబాద్ లోని ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అందిన కాడికి దండుకున్నాడు. ఆపై తప్పించుకుని పోగా.. బాదితులంతా పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన డమ్మీ టిప్పు సుల్తాన్ వారసుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.