ఇక స్కైప్ వీడియో కాల్స్ లేనట్టే…

ఇప్పుడంటే వాట్సాప్ అందుబాటులో ఉంది కానీ, ఒకప్పుడు వీడియో కాల్స్ అనగానే స్కైప్ పేరే గుర్తుకు వచ్చేది. మొదట్లో వీడియో కాలింగ్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులను తెచ్చిన స్కైప్‌కు ఇప్పుడు ముగింపు సమయం వచ్చినట్లు తెలుస్తోంది. పోటీ ప్రపంచంలో నిలవలేకపోతున్న స్కైప్ విషయంలో ఎన్నోసార్లు మైక్రోసాఫ్ట్ మెరుగుపరిచే ప్రయత్నాలు చేసినా, ఈసారి ఎలాంటి అప్‌డేట్ లేకుండా నేరుగా తెరమూసినట్లు అనిపిస్తోంది.

మే నెల నుంచే స్కైప్ పూర్తిగా నిలిపివేయనున్నట్లు లేటెస్ట్ వెర్షన్‌లో సమాచారం కనిపించింది. దీని స్థానంలో మైక్రోసాఫ్ట్ ఇప్పటికే టీమ్స్ ను బలంగా ప్రమోట్ చేస్తోంది. స్కైప్‌ను 2003లో ప్రారంభించగా, 2011లో మైక్రోసాఫ్ట్ దాన్ని కొనుగోలు చేసింది. ఆ తర్వాత కొన్ని మార్పులతో విండోస్ లైవ్ మెసెంజర్‌ను నిలిపివేసి, స్కైప్‌ను ప్రధాన కమ్యూనికేషన్ టూల్‌గా మార్చే ప్రయత్నం చేసింది. కానీ విండోస్ 10లో స్కైప్‌ను అనుసంధానించినా, వినియోగదారుల ఆదరణ పెద్దగా లేకపోవడంతో తొమ్మిది నెలల్లోనే ఆ ప్రయోగం విరమించుకుంది.

మైక్రోసాఫ్ట్ విన్32ను విడిచి UWP(యూనివర్సల్ విండోస్ ప్లాట్‌ఫామ్) కు మారినా, కొన్నేళ్ల తర్వాత మళ్లీ విన్32 వెర్షన్‌కు తిరిగి రావాల్సి వచ్చింది. 2017లో మైక్రోసాఫ్ట్ టీమ్స్ ను ప్రవేశపెట్టినప్పటి నుంచే స్కైప్ భవిష్యత్తు సందిగ్ధంలో పడింది. అనేక సంస్థలు, వినియోగదారులు టీమ్స్ వైపే మొగ్గుచూపడంతో, స్కైప్ ప్రాధాన్యత తగ్గింది. ఆ సమయంలోనే మైక్రోసాఫ్ట్ దీన్ని రిటైర్ చేస్తుందని భావించినా, అప్పటికప్పుడు కొన్ని అప్‌డేట్లు చేస్తూ కొనసాగించింది.

అయితే విండోస్ 11 వచ్చినప్పుడు స్కైప్‌ను తొలగించి, టీమ్స్ ను ప్రాథమ్యంగా ప్రోత్సహించడం స్పష్టమైన సంకేతమేనని విశ్లేషకులు అప్పటినుంచే అంచనా వేశారు. స్కైప్‌కు యాపిల్ ఫేస్ టైమ్, గూగుల్ హ్యాంగౌట్స్, డ్యూయో వంటి అనేక పోటీదారుల నుంచీ గట్టి పోటీ ఎదురైంది. పైగా, మైక్రోసాఫ్ట్ యొక్క విండోస్ ఫోన్ ఫెయిల్యూర్ వల్ల స్కైప్ ఎదుగుదలకు మరింత అడ్డంకి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే కంపెనీ పూర్తి స్థాయిలో టీమ్స్ పై దృష్టి కేంద్రీకరించడంతో, స్కైప్‌కు ఇక పునర్జీవం లభించే అవకాశమే కనిపించలేదు.

మొత్తానికి మైక్రోసాఫ్ట్ ఎట్టకేలకు నిర్ణయం తీసుకొని, మే నుంచి స్కైప్‌ను పూర్తిగా నిలిపివేస్తోంది. స్కైప్ యాప్ వినియోగదారులు త్వరలోనే ఈ నోటిఫికేషన్‌ను చూడనున్నారు. ఇకపై వీడియో కాల్స్, మెసేజింగ్‌ కోసం పూర్తిగా టీమ్స్ వైపే మారాలని మైక్రోసాఫ్ట్ సూచిస్తోంది. ఇది స్కైప్ యూజర్లకు నిరాశ కలిగించే వార్త అయినా, టెక్నాలజీ మారుతున్న కొద్దీ కొత్త మార్గాలను అనుసరించాల్సిన అవసరం ఉందన్నది స్పష్టంగా తెలుస్తోంది.