సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్ షార్ట్ వీడియో ఫీచర్ ‘రీల్స్’ కోసం ప్రత్యేకంగా ఓ కొత్త యాప్‌ను లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మెటా అధినేత అడమ్ మోస్సెరి తన సిబ్బందికి ఈ విషయాన్ని తెలియజేసినట్లు ఓ నివేదికలో వెల్లడైంది. ముఖ్యంగా, టిక్‌టాక్ భవిష్యత్తుపై అమెరికాలో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో ఈ కొత్త ప్లాన్‌ను మెటా ప్రణాళికాబద్ధంగా అమలు చేసే అవకాశముంది.
ఇన్‌స్టాగ్రామ్ ఇప్పటికే రీల్స్ ద్వారా టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. పోటీ గట్టిగానే ఉంది. అయితే, మెటా ఇప్పుడు మరింత ముందుకు వెళ్లి రీల్స్‌ను ఓ ప్రత్యేకమైన యాప్‌గా విడుదల చేయాలని చూస్తోంది. టిక్‌టాక్ స్టైల్‌లో వీడియో స్క్రోలింగ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చాలన్న ఉద్దేశంతో మెటా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, రీల్స్‌కు ప్రత్యేక యాప్ తీసుకురావడం ద్వారా ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఎంగేజ్మెంట్‌కు ఏ మేరకు ప్రభావం ఉంటుందనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
ఇది మెటా మొదటిసారి షార్ట్ వీడియో యాప్‌పై ప్రయోగం చేయడం కాదు. 2018లో ‘లాస్సో’ (Lasso) పేరుతో టిక్‌టాక్‌కు పోటీగా ఒక యాప్‌ను విడుదల చేసింది. అయితే, ఇది పెద్దగా ప్రజాదరణ పొందకపోవడంతో మెటా కొంతకాలం తర్వాత దాన్ని మూసివేసింది. ఇప్పుడు టిక్‌టాక్ మార్కెట్ బలహీనంగా మారిన సమయంలో, మరోసారి మెటా కొత్త ప్రయోగం చేపట్టేందుకు సిద్ధమవుతోంది.
ఇన్‌స్టాగ్రామ్ కేవలం రీల్స్‌కే ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తేవడం వెనుక వ్యూహం ఏమిటన్నదానిపై విశ్లేషణలు కొనసాగుతున్నాయి. టిక్‌టాక్‌కి అమెరికాలో బ్యాన్ ముప్పు ఉందన్న నేపథ్యంలో, టిక్‌టాక్ యూజర్లను ఆకర్షించేందుకు మెటా కొత్త యాప్ తీసుకురావాలని చూస్తోంది. అంతేకాకుండా, ఇటీవలే మెటా ‘ఎడిట్స్’ అనే వీడియో ఎడిటింగ్ యాప్‌ను కూడా ప్రకటించింది. ఇది టిక్‌టాక్ యాజమాన్యంలోని ‘కాప్‌కట్’ కు ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంది. ఇంతకుముందు ఫెయిలైన ప్రయోగాల నుంచి మెటా ఈసారి ఎంతవరకు కొత్త మార్గంలో ప్రయాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.