ఇటీవల అంతరిక్ష పరిశోధకులు భూమి వైపుగా దూసుకొస్తున్న 2024 వైఆర్ 4 అనే గ్రహశకలాన్ని గుర్తించారు. ఈ గ్రహశకలం 2032లో భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని నాసా మొదట హెచ్చరించింది. దాని ప్రకారం, ప్రాథమిక విశ్లేషణలలో ఈ గ్రహశకలం భూమిని తాకే అవకాశాలు 3.1 శాతంగా ఉన్నాయని తెలిపారు. అయితే, ఈ సమాచారం బయటకు రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది.
తర్వాతి రోజుల్లో నాసా మరిన్ని పరిశీలనలు చేపట్టి, ముప్పు శాతం క్రమంగా తగ్గుతున్నట్లు ప్రకటించింది. ఈ నెల 19న జరిగిన విశ్లేషణలో 1.5 శాతంగా, అదే నెల 24న 0.002 శాతానికి తగ్గినట్లు తెలిపారు. చివరికి, భూమికి ఎటువంటి ముప్పు లేదని, ఈ గ్రహశకలం భూమిని దాటిపోతుందని స్పష్టంగా ప్రకటించారు. ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) కూడా ఇదే విషయాన్ని ధృవీకరించింది.
2024 డిసెంబర్ 27న చిలీ పరిశోధకులు ఈ గ్రహశకలాన్ని మొదట గుర్తించారు. సూర్యుడి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్న ఈ గ్రహశకలం సుమారు 50 మీటర్ల వ్యాసం కలిగినదని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీని లోపలి నిర్మాణం, మూలకాలు ఇంకా పూర్తి స్థాయిలో తెలియలేదని, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపుతో మార్చి, మే నెలల్లో పరిశీలనలు కొనసాగిస్తామని తెలిపారు.
మొత్తానికి, 2024 వైఆర్ 4 అనే గ్రహశకలం భూమిని ఢీకొట్టే ప్రమాదం లేదని నాసా స్పష్టత ఇచ్చింది. అయితే, ఇది 2028 జూన్ లో మళ్లీ భూమికి దగ్గరగా వస్తుందని, అప్పటి పరిస్థితులను పరిగణనలో ఉంచుకుని నిరంతరం నిఘా కొనసాగిస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు. భూమి భవిష్యత్తు విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని తేల్చేశారు.