ప‌బ్లిసిటీ స్టంట్: తెలుగు సెలబ్స్ పై రాయుడు కామెంట్స్‌

టీమ్ ఇండియా మాజీ క్రికెట‌ర్, ఏపీకి చెందిన అంబ‌టి రాయుడు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. ప‌బ్లిసిటీ “స్టంట్ కోస‌మే కొంద‌రు పాకిస్థాన్‌-ఇండియా క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వ‌చ్చారు”- అని వ్యాఖ్యానించా రు. ఈ వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు దుమ్మెత్తి పోస్తున్నారు. నీక‌న్నా.. త‌క్కువ అనుకుంటున్నావా? ఇలాంటి చీప్ మెంటాలిటీ ఉంటుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు-అని అంబ‌టి రాయుడిపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

ఏం జ‌రిగింది?

దుబాయ్‌లో జ‌రిగిన ఛాంపియ‌న్స్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్‌.. దాయాది దేశాలైన భార‌త్‌-పాకిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగింది. ఈ రెండు జ‌ట్ల‌కు ఉండే క్రేజ్ ఎంతో అంద‌రికీ తెలిసిందే. పైగా విదేశీ గ‌డ్డ‌పై అందునా ఛాంపియ‌న్స్ ట్రోఫీ కావ‌డంతో ఈ క్రేజ్ మ‌రింత పెరిగింది. దీనిని ప్ర‌త్య‌క్షంగా వీక్షించాల‌ని అనేక మంది అనుకున్నారు. వీరిలో ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌లు కూడా ఉన్నారు. అయితే.. కొంద‌రు టికెట్లు దొర‌క్క ఆగిపోయారు. మ‌రికొంద‌రు ద‌క్కించుకుని క్రికెట్‌ను ప్ర‌త్య‌క్షంగా వీక్షించారు. భార‌త్ గెలుపును ఆస్వాదించారు. గ‌ర్వంగా ఫీల‌య్యారు.

ఇలా.. దుబాయ్‌కు వెళ్లి ప్ర‌త్య‌క్షంగా క్రికెట్‌ను వీక్షించిన వారిలో ప్ర‌ముఖ న‌టుడు, మెగా స్టార్ చిరంజీవి, పుష్ప ద‌ర్శ‌కుడు సుకుమార్‌, ఏపీ మంత్రి, యువ నాయ‌కుడు నారా లోకేష్‌, విజ‌య‌వాడ ఎంపీ కేశినేని చిన్ని వంటి తెలుగు వారు కూడా ఉన్నారు. అయితే.. వీరిని ఉద్దేశించి.. కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న టీమిండియా మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. “ఇలాంటి మ్యాచ్‌లకు వస్తే టీవీల్లో ఎక్కువగా కనిపిస్తారు కదా, పబ్లిసిటీ స్టంట్. అందుకే వస్తారు” అని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు గుప్పించాడు.

ఈ వ్యాఖ్య‌లు క్ష‌ణాల్లో వైర‌ల్ అయ్యాయి. అంబ‌టి పై నెటిజ‌న్లు నిప్పులు చెరుగుతున్నారు. ఎంతో క‌ష్ట‌ప‌డి దుబాయ్ వ‌చ్చి.. క్రీడ‌ను వీక్షించిన వారి ప‌ట్ల ఇంత నీచ‌మైన వ్యాఖ్య‌లు చేస్తావా? అంటూ.. వ్యాఖ్యానించా రు. మ‌రికొందరు “నువ్వు తోప‌నుకుంటున్నావా?” అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. మొత్తానికి అంబటి రాయుడు చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. కాగా.. ఈ వ్యాఖ్య‌ల‌పై చిరు, సుకుమార్‌, నారా లోకేష్ స్పందించ‌లేదు.