ఇటీవల ఓటీటీ, సోషల్ మీడియా వేదికలపై అసభ్య, అనుచిత కంటెంట్ పెరుగుతున్నట్లు అనేక ఫిర్యాదులు రావడంతో కేంద్ర ప్రభుత్వం గట్టిగా స్పందించింది. ఐటీ చట్టం-2021లోని మార్గదర్శకాల ప్రకారం కచ్చితంగా నిబంధనలు పాటించాలని హెచ్చరించింది. చిన్నారులు, యువత ఈ కంటెంట్‌కు అసలు చూపించని విధంగా అన్ని ప్లాట్‌ఫామ్‌లు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సూచించింది.
ఇండియాస్ గాట్ టాలెంట్ షోలో రణ్‌వీర్ అలహాబాదియా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఊతమిచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్రం అందరికీ గుర్తు చేసింది. వయస్సు ఆధారంగా కంటెంట్‌ను విభజించడం, A రేటెడ్ కంటెంట్ పిల్లలకు అందకుండా చూడటం అత్యవసరమని. కంటెంట్ పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కేంద్రం స్పష్టం చేసింది.
ప్రధానంగా, స్వీయ నియంత్రణ ప్రతి ఓటీటీ, సోషల్ మీడియా సంస్థల బాధ్యతగా కేంద్రం పేర్కొంది. ఎలాంటి కంటెంట్ ప్రదర్శించినా, అది సమాజ నైతికతను దెబ్బతీయకూడదని, ఎవరినీ అవమానించేలా లేకుండా ఉండాలని స్పష్టం చేసింది. ఏ విధంగానైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే, తక్షణమే ఆ కంటెంట్‌ను తొలగించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
సుప్రీం కోర్టు కూడా ఇటీవల యూట్యూబ్ వంటి వేదికలపై ఆంక్షలు పెంచాలని, అనుచిత కంటెంట్‌ను కట్టడి చేయాలని సూచించిన విషయం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో, డిజిటల్ వేదికలు తమ కంటెంట్‌పై మరింత జాగ్రత్తగా ఉండాలని, మార్గదర్శకాల మేరకు సమాజం, పిల్లలకు హాని కలిగించే విషయాలను పూర్తిగా నియంత్రించాలని కేంద్రం మరోసారి స్పష్టంగా హెచ్చరించడం ఇప్పుడు కీలకంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates