టీమిండియా జెర్సీపై పాక్ ‘పాకిస్తాన్’ : బీసీసీఐ ఏమనదంటే…!

టీమిండియా పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అసలు భారత జట్టు వెళుతుందా లేదా అనే అంశంపై మొదటి నుంచి అనేక రకాల చర్చలు వైరల్ అయిన విషయం తెలిసిందే. భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్‌లో ఆడటానికి బీసీసీఐ నిరాకరించింది. దీంతో ICC భారత్ మ్యాచ్ లను మాత్రమే దుబాయ్ వేదికగా నిర్వహించేలా నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20న బంగ్లాదేశ్‌తో మొదటి మ్యాచ్‌ ఆడనుండగా, BCCI ఆటగాళ్ల ద్వారా కొత్త జెర్సీలను ఆవిష్కరించింది.

కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్, మహమ్మద్ షమీ తదితర ఆటగాళ్లు ఈ కొత్త జెర్సీలతో ఫొటోలకు పోజులిచ్చారు. బీసీసీఐ సోషల్ మీడియా ద్వారా వీటి ఫొటోలు పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ కొత్త జెర్సీలపై ఛాంపియన్స్ ట్రోఫీ లోగోలో పాకిస్థాన్ పేరు ఉండటమే ప్రధానంగా చర్చకు కారణమైంది. పాకిస్థాన్ ఈ టోర్నీకి ఆతిథ్యమిస్తుండటంతో, ఐసీసీ నిబంధనల ప్రకారం ఆ దేశం పేరు ట్రోఫీ లోగోలో ఉండాల్సిందే.

అయితే, ఇదే అంశంపై గతంలో కొన్ని వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. భారత జట్టుకు పాకిస్థాన్ పేరు ఉన్న జెర్సీ తొడిగించడం సరికాదని అభిప్రాయపడిన కొంతమంది అభిమానులు, బీసీసీఐ ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే, బీసీసీఐ దీనిపై స్పష్టత ఇచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ ఆదేశాలకు అన్ని దేశాలు కట్టుబడి ఉండాలని, పాకిస్థాన్‌ పేరు తొలగించాలని తాము ఎక్కడా డిమాండ్ చేయలేదని పేర్కొంది.

ఆతిథ్య దేశానికి టోర్నమెంట్ లోగోలో తమ పేరు ఉండే హక్కు ఉందని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపారు. ఇది అధికారిక నిబంధనల ప్రకారం జరుగుతున్నదని, భారత జట్టు ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించదని స్పష్టం చేశారు. ఈ వివాదం మళ్లీ తెరపైకొచ్చినప్పటికీ, టీమ్ఇండియా మెగా టోర్నీ కోసం ఉత్సాహంగా సిద్ధమవుతోంది. ఆటపై దృష్టి పెట్టాలని కోరుతున్న అభిమానులు, ఇదేవిధంగా ఏవిధమైన వివాదాలు లేకుండా భారత్ విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. ఇకపోతే, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత ప్రదర్శన ఎలా ఉంటుందనేది క్రికెట్ ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.