ఇక ఎయిర్ అంబులెన్స్ లు… ఖరీదైనా క్షణాల్లోనే చికిత్సలు

కాంగ్రెస్ పార్టీ దివంగత నేత పి. జనార్దన్ రెడ్డి పేరు వినే ఉంటారు కదా. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ కేంద్రంగా రాజకీయాలు చేసిన ఆయన పీజేఆర్ గా జనానికి చిరపరచితులు. నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాలుపంచుకున్న సందర్భంగా… అక్కడే గుండెపోటుకు గురయ్యారు. పీజేఆర్ ను ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు, ఆయన భద్రతా సిబ్బంది చేయని యత్నం లేదు. గాంధీ భవన్ వద్ద ఉదయం 11 గంటల ప్రాంతంలో ట్రాఫిక్ ఎలా ఉంటుందో తెలుసు కదా. పీజేఆర్ ను ఎక్కించిన వాహనం ఆ ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది. ఇంకేముంది… ట్రాఫిక్ ను క్లియర్ చేసేలోగానే పీజేఆర్ శ్వాస ఆగిపోయింది. ఆ ట్రాఫిక్ లోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు. అప్పుడే… ఎయిర్ అంబులెన్స్ అందుబాటులో ఉండి ఉంటేనా?.. అంటూ ఓ ఆసక్తికర కథనం వినిపించింది.

నిజమే… నాడు ఎయిర్ అంబులెన్స్ అందుబాటులో ఉండి ఉంటే… పీజేఆర్ బతికి బట్టకట్టేవారే. అయితే ఆ అవకాశం నాడు లేదు కదా. పీజేఆర్ మరణించింది 2007లో. ఇప్పటికి సరిగ్గా 18 ఏళ్ల క్రితం అన్నమాట. ఇన్నేళ్లకు గాను ఇప్పుడు ఎయిర్ అంబులెన్స్ అందుబాటులోకి వస్తోంది. అత్యవసర చికిత్సలు అవసరమైన వారిని హెలికాఫ్టర్లలో తరలించే సౌకర్యం అందుబాటులోకి వచ్చినా… ఎయిర్ అంబులెన్స్ మాత్రం ఇప్పటిదాకా మనకు అందుబాటులోకి రాలేదనే చెప్పాలి. 2026 చివరి నాటికి ఎయిర్ అంబులెన్స్ లు దాదాపుగా దేశంలోని ప్రధాన నగరాలతో పాటుగా అన్ని జిల్లా కేంద్రాలకు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ దిశగా ఐఐటీ మద్రాస్ కు చెందిన స్టార్టప్ సంస్థ ఈప్లేన్.. భారత్ కు చెందిన ఎయిర్ అంబులెన్స్ సర్వీసుల సంస్థ ఐ క్యాట్ తో కీలక ఒప్పందం చేసుకుంది. బిలియన్ యూఎస్ డాలర్ల విలువ కలిగిన ఈ ఒప్పందం ద్వారా ఈప్లేన్ కంపెనీ ఏకంగా 788 ఎయిర్ అంబులెన్స్ లతో దేశవ్యాప్తంగా సేవలను అందించనుంది.

ఇక వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తిగా అందుబాటులోకి రానున్న ఈ సేవల్లో వినియోగించే ఎయిర్ అంబులెన్స్ లన్నీ ఎలక్ట్రిక్ అంబులెన్స్ లే. రోడ్డు మీదే దిగడంతో పాటుగా రోడ్డు మీద నుంచే ఆకాశంలోకి ఎగిరే ఈ అంబులెన్స్ ల గరిష్ట వేగం గంటకు 200 కిలో మీటర్లట. అంతేకాకుండా ఒక్కసారి చార్జీ చేస్తే ఈ ఎయిర్ అంబులెన్స్ లు 110 నుంచి 200 కిలో మీటర్ల దాకా నాన్ స్టాప్ గా ప్రయాణించగలవు. ఇక ఈ ఎయిర్ అంబులెన్స్ ల్లో ఓ పైలట్, ఓ పారా మెడికల్ సిబ్బంది, ఓ స్ట్రెచర్ ఉంటాయి. అంతేకాకుండా అందులో అత్యవసర వైద్య చికిత్సలు అందించే పరికరాలు కూడా ఉంటాయి. ఈ సేవలు అందుబాటులోకి వస్తే… ఈ తరహా సేవలు అందుబాటులో ఉన్న అతి కొద్ది దేశాల సరసన భారత్ కూడా చోటు సంపాదించుకుంటుంది. అంతేకాకుండా దేశ వైద్య రంగంలో కీలక అడుగు పడినట్టు అవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎయిర్ అంబులెన్స్ చికిత్సలు కాస్తంత కాస్ట్ లీ అయినా కూడా ఆపత్కాలంలో ప్రాణాలు కాపాడుకునే దిశగా ఈ సేవలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పక తప్పదు.