ప్రజలకు ఉన్నది ఉన్నట్టు చెప్పకపోయినా.. కనీసం మీడియాకైనా సరైన సమాచారం ఇచ్చే విషయంలో రైల్వే శాఖ పాత్ర నానాటికీ తీసికట్టుగా మారుతోంది. గతంలో రైల్వే ప్రకటనలు ముందు మీడియాకు చేరేవి. కానీ, ఇప్పుడు అంతా గోప్యం.
“ఏదైనా ఉంటే.. మా వెబ్‌సైట్‌లో చెబుతాం“ అంటూ రైల్వే శాఖ ప్రకటించి మౌనం పాటిస్తోంది. పైగా.. కీలక విషయాల్లో అయితే.. మీడియాను చాలా తప్పుదోవ పట్టిస్తోంది. తాజాగా శనివారం జరిగిన ఢిల్లీ రైల్వే స్టేషన్ విషాదంలో రైల్వే శాఖ వ్యవహరించిన తీరుపై మీడియా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో మహాకుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు.. శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచే పోటెత్తడం ప్రారంభించారు. ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా నాలుగు రైళ్లను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి రైల్వే శాఖ.. ముందుగానే ప్రకటనలు గుప్పించింది. చిత్రం ఏంటంటే.. ఈ రైళ్లలో రెండింటిని క్యాన్సిల్ చేశారు. ఈ విషయాన్ని మాత్రం చివరి నిముషంలో అంటే.. శనివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ప్రకటించారు. దీనికి కారణాలు కూడా చెప్పలేదు.
ఇలా చెప్పి ఉన్నా.. మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగి ప్రయాణికులు వచ్చేవారు కాదు. కానీ, రైల్వే శాఖ క్యాన్సిల్ చేసిన విషయాన్ని చెప్పడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఇక, తొక్కిసలాట వ్యవహారాన్ని కూడా.. రాత్రి 9.55 గంటల వరకు గోప్యంగా ఉంచారు.
వాస్తవానికి జాతీయ మీడియాకు అనుమానం వచ్చింది. కానీ, రైల్వే పరిధిలో మీడియా ప్రవేశించాలంటే ఉన్నతాధికారుల అనుమతి కావాలి. ఈ నేపథ్యంలో లోపలికి వెళ్లి పరిశీలించే సాహసం ఎవరూ చేయలేక పోయారు. ప్రయాణికుల నుంచి అందిన సమాచారాన్ని మాత్రమే ప్రసారం చేస్తూ వచ్చారు.
కానీ, ఇందులో కూడా.. కొందరు రైల్వే అధికారులు ప్రయాణికుల రూపంలో సందేశాలు పంపించారు. “ఏమీ జరగలేదు.. అంతా బాగానే ఉంది. తొక్కిసలాట కాదు.. కేవలం రద్దీనే“ అంటూ 9 గంటల వరకు మీడియాను దారిమళ్లించారు.
ఆ తర్వాత.. కూడా.. స్వల్ప తొక్కిసలాట, ఎవరికీ ప్రాణ నష్టం లేదు.. అనే చెప్పుకొచ్చారు. కానీ, ఎప్పుడైతే.. ప్రయాణికులు పదుల సంఖ్యలో మృతి చెందారో.. అప్పుడు బరస్ట్ కాక తప్పలేదు. దీంతో మీడియా దూసుకుపోయి.. వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది.
మరో చిత్రం ఏంటంటే.. ఆదివారం ఉదయం 8 గంటల వరకు కూడా ఎంత మంది చనిపోయారన్న సంఖ్యను రైల్వే శాఖ వెల్లడించకపోవడం. సో.. ఇలా తనకు ప్రతికూల వాతావరణం వచ్చినప్పుడు.. పలు కేంద్ర ప్రభుత్వ శాఖలు మీడియాను తప్పుదోవ పట్టించడం సర్వసాధారణంగా మారింది.