సాధారణంగా భార్యా భర్త అన్నాక.. ఒకరిపై ఒకరికి ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఉండాలి. మూడు ముళ్ల బంధానికి, ఏడు అడుగుల అనుబంధానికి కూడా అదేఅర్థం.. పరమార్థంగా పెద్దలు చెబుతారు. 1980లలో దిగ్గజ దర్శకుడు బాపు తీసిన `రాధా కల్యాణం` సినిమాలోనూ ఇదే చూపించారు.
పెళ్లి కానంత వరకు.. ఓ మహిళ.. లేదా పురుషుడు ఎవరినైనా ప్రేమించవచ్చు. వారితో ఒకవేళ పెళ్లికాకపోతే.. పెళ్లి అయిన వారినే ప్రేమించాలని.. జీవితాంతం వారితోనే తోడు-నీడగా గడపాలన్న అద్భుత సందేశం ఇచ్చిన సినిమా అది.
“పెళ్లి కానంత వరకు ఎవరి జీవితమైనా.. అద్దమే. దానిలో ఎన్ని ముఖాలైనా చూసుకోవచ్చు. కానీ, పెళ్లయ్యాక.. అది `పటం`గా మారుతుంది. అందులో ఒకరి ముఖమే కనిపిస్తుంది“ అనే డైలాగ్ అప్పట్లో ఫ్యామస్. అలాంటి అద్భుతమైన పెళ్లి బంధాన్ని చిత్రీకరించిన బాపు సినిమా.. ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో పేరెన్నెకగన్న సినిమా.
అయితే.. తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు దీనికి మరో నిర్వచనాన్ని చెప్పుకొచ్చింది. పెళ్లి అయినప్పటికీ.. భర్తతో సంసారం చేస్తున్నప్పటికీ.. భార్య వేరే వ్యక్తిని ప్రేమించవచ్చని, అతనిపై మనసు పడవచ్చని.. ఆప్యాయతా కురిపించవచ్చని తేల్చి చెప్పింది.
అంతేకాదు.. ఈ విషయంలో తప్పుపట్టడానికి కూడా అవకాశం లేదని తెలిపింది. కానీ, సెక్స్ కార్యకలాపా లకు మాత్రం దూరంగా ఉండాలని కోర్టు పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో తన భార్య వేరే వారిని ప్రేమిస్తోందని.. ఆమె నుంచి విడాకులు కావాలని కోరిన భర్తకు చీవాట్లు పెట్టింది.
ఆమెకు పరిహారం ఇవ్వడంతోపాటు.. నెల నెలా భరణం కూడా చెల్లించాలని కోర్టు ఆదేశించడం గమనార్హం. అంటే.. భార్య వేరే వారిని ప్రేమించినప్పటికీ.. ఆ విషయం భర్తకు తెలిసినప్పటికీ.. కామ్ గా సంసారం చేసుకోవాల్సిందేనన్ని కోర్టు తీర్పు భావం!