గోదావ‌రి టు హైద‌రాబాద్‌.. పందెం కోళ్ల ప‌రుగు!!

ఏపీలోని గోదావ‌రి జిల్లాల పేరు చెప్ప‌గానే ‘పందెం కోళ్లు’ గుర్తుకు వ‌స్తాయి. ఆయా జిల్లాల్లో ఎక్క‌డో ఒక చోట రోజూ పందేలు కామ‌న్‌. ఇక‌, తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి వ‌చ్చిందంటే పందేల‌కు తిరుగులేదు. ఈ ఏడాది అయితే.. ఊరూ వాడా విచ్చ‌ల‌విడిగా చెల‌రేగి మ‌రీ పందేలు కాశారు. సుమారు 2 వేల కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు కోడి పందేల్లో సొమ్ములు పారిన‌ట్టు స‌మాచారం. ఇక‌, ఇప్పుడు ఈ గోదావ‌రి సంస్కృతి రెక్క‌లు క‌ట్టుకుని హైద‌రాబాద్‌కు వాలిపోయింది.

తాజాగా హైదరాబాద్ శివారులోని ఫాం హౌస్‌లో కోడి పందేలు నిర్వ‌హిస్తున్న‌ట్టు వ‌చ్చిన వార్త‌లు క‌ల‌కలం రేపాయి. అదేస‌మ‌యంలో వైసీపీ హ‌యాంలో గుడివాడ‌కు ప‌రిమిత‌మైన క్యాసినో జూదం కూడా హైద‌రాబాద్ కు చేరిపోయింది. ఈ వ్య‌వ‌హారంపై ఉప్పందుకున్న రాజేంద్ర‌న‌గ‌ర్ పోలీసులు స‌ద‌రు ఫామ్ హౌస్ పై దాడి చేసి 64 మందిని అరెస్టు చేశారు. కోడి పందేలు, క్యాసినో కోసం సిద్ధం చేసిన 30 లక్షల రూపాయల నగదును సీజ్ చేయ‌డంతోపాటు 55 లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు.

ఇక, ఫామ్ హౌస్‌లో ఉన్న 86 పందెం కోళ్ళను కూడా పోలీసులు స్టేష‌న్‌కు త‌ర‌లించారు. వీటిని గోదావ‌రి జిల్లాల నుంచి త‌ర‌లించిన‌ట్టు తెలిపారు. పెద్ద మొత్తంలో బెట్టింగ్ కాయిన్స్ స్వాధీనం చేసుకున్న‌ట్టు చెప్పారు. అలాగే.. పందెం కోళ్లకు క‌ట్టేందుకు తీసుకువ‌చ్చిన‌ 46 విదేశీ కోడి కత్తులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని ప్రముఖులను ఆహ్వానించి.. ఈ కోడిపందేలు క్యాసినో నిర్వహిస్తున్నార‌ని పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన శివకుమార్ వర్మ అనే వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఈయ‌న‌పై గ‌తంలోనూ కేసు న‌మోదైంద‌ని తెలిపారు.