భారతదేశంలో ఆధార్ సేవలు వేగంగా పెరుగుతున్నాయి. 2025 జనవరిలో 284 కోట్ల ఆధార్ ధృవీకరణ లావాదేవీలు జరిగాయి. గతేడాది ఇదే సమయంలో 214.8 కోట్ల లావాదేవీలు నమోదుకాగా, ఇప్పుడు 32% వృద్ధి కనిపించింది. దీని వెనుక ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) కీలక పాత్ర పోషిస్తోంది.
ప్రస్తుతం రోజుకు 9 కోట్లకు పైగా ఆధార్ ధృవీకరణలు జరుగుతున్నాయి. ఇందులో ఫేస్ అథెంటికేషన్ ఎక్కువగా ఉపయోగపడుతోంది. జనవరిలో 12 కోట్లకు పైగా ఫేస్ అథెంటికేషన్ లావాదేవీలు జరిగాయి. 2021లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 102 కోట్ల ఫేస్ ధృవీకరణలు పూర్తయ్యాయి. కేవలం గత 12 నెలల్లోనే 78 కోట్ల ధృవీకరణలు పూర్తయినట్లు UIDAI ప్రకటించింది.
AI ఆధారిత ఫేస్ అథెంటికేషన్ సేవను UIDAI అభివృద్ధి చేసింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, టెలికమ్యూనికేషన్, హెల్త్‌కేర్, ప్రభుత్వ పథకాల్లో దీని వినియోగం పెరుగుతోంది. తక్కువ సమయం, ఎక్కువ భద్రత, స్పష్టమైన గుర్తింపు ఇవన్నీ AI వల్ల సాధ్యమవుతున్న ప్రయోజనాలు. ఇక ఆధార్ e-KYC సేవ కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది. జనవరిలో 43 కోట్లకు పైగా e-KYC లావాదేవీలు జరిగాయి.
2025 జనవరి నాటికి మొత్తం 2268 కోట్ల e-KYC లావాదేవీలు నమోదయ్యాయి. ఆధార్ ధృవీకరణలో AI ఉపయోగం వల్ల లావాదేవీలు వేగంగా, సురక్షితంగా, సులభంగా జరుగుతున్నాయి. భవిష్యత్తులో AI టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందితే, ఆధార్ సేవలు ఇంకా మెరుగవుతాయి. దీని వల్ల లావాదేవీలు సులభంగా, నమ్మకంగా, వేగంగా జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.