అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఇప్పటికే వలసదారులపై కఠిన నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలిచిన ట్రంప్, తాజాగా ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్యపై సంచలన ప్రకటన చేశారు. గాజాను తమ ఆధీనంలోకి తీసుకుంటామని ఆయన ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. పాలస్తీనియన్లకు పునరావాసం కల్పించిన అనంతరం గాజాపై నియంత్రణ సాధిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ట్రంప్ తాజాగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు, హమాస్, హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపుల పోకడలు, భవిష్యత్ వ్యూహాలు వంటి కీలక అంశాలు చర్చకు వచ్చాయి. గాజాలో శాంతి నెలకొల్పేందుకు అమెరికా కీలక పాత్ర పోషిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. పాలస్తీనియన్లకు ఉపాధి అవకాశాలు, స్థిర నివాస వసతులు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పారు.
సమావేశం అనంతరం జరిగిన జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ట్రంప్ మాట్లాడుతూ, గాజాలో శాంతిని నెలకొల్పేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మధ్యప్రాచ్యాన్ని సమృద్ధిగా మారుస్తామని, గాజాను పూర్తిగా ఆధీనంలోకి తీసుకోవడం ద్వారా ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యకు పరిష్కారం చూపగలనన్నారు. అయితే, గాజా ప్రాంతాన్ని తమ నియంత్రణలోకి తీసుకోవడానికి ముందు పాలస్తీనియన్లను రీలొకేట్ చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.
అమెరికా, ఇజ్రాయెల్ కలిసి పాలస్తీనియన్ సమస్యకు పరిష్కారం కనుగొనాలని ట్రంప్ పేర్కొన్నారు. గాజాలో భద్రతా పరమైన పరిస్థితులను పర్యవేక్షించేందుకు అమెరికా సైన్యాన్ని అక్కడ మోహరించే యోచన ఉందని తెలిపారు. గాజాలో శాంతి నెలకొల్పడమే లక్ష్యమని, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
ట్రంప్ ప్రకటనతో మధ్యప్రాచ్యంలో భవిష్యత్ పరిస్థితులపై చర్చ మొదలైంది. ఈ నిర్ణయం అంతర్జాతీయ స్థాయిలో వివాదాస్పదమవుతుందా? లేక ట్రంప్ చెప్పినట్లు వాస్తవికంగా అమలవుతుందా? అన్నది చూడాల్సిన విషయమే. అయితే, గాజాపై అమెరికా పెత్తనం పెంచే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.