అన్నీ కలిసొస్తున్నపుడు ఏం చేసినా చెల్లిపోతుంది. కానీ పరిస్థితులు తిరగబడ్డపుడే నిర్ణయాలు కొంచెం ఆచితూచి తీసుకోవాల్సి ఉంటుంది. మహేంద్రసింగ్ ధోనీకి ఈ విషయం ఇప్పుడు బాగానే బోధపడుతూ ఉంటుంది. ఐపీఎల్లో ఇంతకుముందు చెన్నై జట్టు ఎలా ఉన్నా సరే బాగా ఆడేది. టోర్నీలో ఒడుదొడుకులు ఎదురైనా సరే.. పుంజుకునేది.
డాడీస్ ఆర్మీ అని కౌంటర్లు పడ్డా సరే.. వయసు మళ్లిన ఆటగాళ్లనే నమ్ముకుని ధోనీ అద్భుతాలు చేశాడు ఆ జట్టుతో. స్వయంగా బాగా ఆడేవాడు, సహచరులూ పూర్తి స్థాయిలో రాణించేవాళ్లు. కానీ ఈసారి మాత్రం మొత్తం తిరగబడింది. ధోని ఆడట్లేదు. అతడి కెప్టెన్సీ పని చేయట్లేదు. ఆటగాళ్లు అంచనాలను అందుకోవట్లేదు. మొత్తంగా ఆ జట్టు కథ లీగ్ దశలోనే ముగియడం ఖాయంగా కనిపిస్తోంది.
ఐతే ఈ క్రమంలో ఎన్నడూ లేనంతగా ధోని కెప్టెన్సీ చర్చనీయాంశం అవుతోంది. ముఖ్యంగా తుది జట్టు ఎంపికలో ధోని తీసుకున్న నిర్ణయాలు ఎవ్వరికీ అంతుబట్టడం లేదు. ఒక ఆటగాడు బాగా ఆడట్లేదు, ఆడే అవకాశం కూడా లేదని స్పష్టంగా కనిపిస్తున్నా అతణ్ని పట్టుబట్టి జట్టులో కొనసాగించడం అంతుబట్టని విషయం. ఆ ఆటగాడు కేదార్ జాదవ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఐపీఎల్లో జాదవ్ లాగా విమర్శలెదుర్కొన్న, సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్న ఆటగాడు మరొకరు కనిపించరు.
8 మ్యాచుల్లో అతను చేసింది కేవలం 62 పరుగులు. బ్యాటింగ్ దారుణంగా ఉంది. బౌలింగ్ చేయట్లేదు. ఫీల్డింగ్ అంతంతమాత్రం. కానీ ఎందుకతను జట్టులో ఉన్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. కోల్‌కతాతో మ్యాచ్‌లో దారుణమైన బ్యాటింగ్‌తో తీవ్ర స్థాయిలో విమర్శలెదుర్కొన్నాడు జాదవ్. దీంతో రెండు మ్యాచ్‌లకు అతణ్ని తప్పించారు.
కానీ తర్వాత మళ్లీ జట్టులోకి తీసుకొచ్చేశాడు ధోని. వచ్చాక అతణ్ని బ్యాటింగ్ ఆర్డర్లో ముందు పంపి నిరూపించుకునే అవకాశం ఇవ్వలేదు. ఎక్కడో ఏడో స్థానంలో దించారు. రాజస్థాన్‌తో తాజా మ్యాచ్‌లోనూ జాదవ్ పేలవంగానే ఆడాడు. ఏడు బంతుల్లో 4 పరుగులే చేశాడు. దీంతో అతడి మీద విరుచుకుపడుతున్నారు నెటిజన్లు. విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. భారీగా మీమ్స్ పడుతున్నాయి. అసలు ధోని ఎందుకు అతణ్ని జట్టులో ఆడిస్తున్నాడన్న ప్రశ్నలే ఎటు చూసినా. ఆటగాళ్లపై నమ్మకం పెట్టి మళ్లీ మళ్లీ అవకాశాలిస్తాడని ధోనీకి పేరుంది. కానీ మిగతా ఆటగాళ్ల సంగతేమో కానీ.. జాదవ్ ఇంత పూర్ ఫామ్‌లో ఉన్నా, ఇంతగా విమర్శలు వస్తున్నా ఎవరో చెబితే అతణ్ని పక్కన పెట్టేదేంటి అన్నట్లుగా ధోని పంతం పట్టి అతణ్ని ఆడిస్తుండటమే విడ్డూరం.