గజదొంగ ప్రభాకర్ లైఫ్ స్టైల్ తెలిస్తే నోటమాట రాదంతే

బత్తుల ప్రభాకర్.. శనివారం రాత్రికి ముందు వరకు కూడా పోలీసు రికార్డుల్లో మాత్రమే ఫేమస్. ఎప్పుడైతే ప్రిజం పబ్ లో కాల్పులకు తెగబడ్డాడో.. ఒక్కసారిగా అందరి చూపు అతడి మీద పడింది. అతడి క్రిమినల్ హిస్టరీ గురించి ఆరా తీసిన పోలీసులు మొదలు.. అతడి గురించి వివరాలు తెలిస్తే కొద్దీ నోట మాట రాలేదంతే. రెండు తెలుగు రాష్ట్రాల్లో 80కు పైగా కేసులు.. తప్పించుకొని తిరుగుతూ.. పోలీసులకు సైతం సవాలుగా మారిన అతడు.. చివరకు అనూహ్య పరిణామాల్లో చిక్కటం ఒక ఎత్తు అయితే.. ఆ సందర్భంలో అతడి దగ్గర రెండు దేశవాళీ పిస్టళ్లు ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

దొంగతనాలు చేసే అతగాడి వద్ద రెండు ఆయుధాలు ఒక ఎత్తు అయితే.. అతడ్ని ప్రాథమికంగా విచారించిన వేళ.. వెలుగు చూసిన విషయాలు మరింత విస్మయానికి గురి చేసేలా చేశాయి. అతడి ఛాతీ మీద 3.. 100 అంకెలతో పచ్చబొట్టు వేయించుకోవటం.. ఖరీదైన ఇంట్లో నివాసం.. ఇంట్లోనే జిమ్ తో పాటు.. రూ.10వేలు పెట్టి వంట మనిషిని ఏర్పాటు చేసుకోవటం.. ఆడి.. బీఎండబ్ల్యూ లాంటి ఖరీదైన కార్లలో తిరగటం లాంటి వివరాలు మరింత ఆశ్చర్యానికి గురి చేశాయి.

దీంతో ఇతగాడి గురించి మరింత లోతుగా ఆరా తీసిన పోలీసులు.. అతడి ఇంట్లో సోదాలు చేయగా ఒక డైరీ లభ్యమైనట్లుగా చెబుతున్నారు. అందులో తన ఫ్యూచర్ టార్గెట్ల గురించి రాసుకున్నట్లుగా తెలుస్తోంది. విశాఖ జైల్లో తనకు పరిచయమైన ఒక నేరస్తుడి సాయంతో రూ.10 లక్షలు ఖర్చు చేసి బిహార్ నుంచి మూడు పిస్టళ్లు.. 500 బుల్లెట్లు తెప్పించుకున్నాడు. అంతేకాదు.. గన్ ఫైరింగ్ లో అనుభవం కోసం ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఉన్న కొండ ప్రాంతాల్లో ప్రాక్టీస్ చేసినట్లుగా తెలుస్తోంది.

తన ప్రాక్టీస్ లో భాగంగా ఒక కుక్కను కాల్చి చంపినట్లుగా చెబుతున్నారు. అతడి స్నేహితులను ప్రశ్నించే క్రమంలో మరిన్ని వాస్తవాలు వెలుగు చూశాయి ఏపీలో అతడికి చేపల చెరువులు.. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు ఇతరత్రా వ్యవహారాలు చేస్తుంటాడని తేలింది. సెక్యూరిటీ కోసం పిస్టళ్లు కొనుగోలు చేసినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే పెళ్లైనప్పటికి.. భార్యతో కలిసి ఉండటం లేదని.. గచ్చిబౌలిలో మరో రాష్ట్రానికి చెందిన యువతికి డబ్బు ఆశగా చూపి.. ఆమెతో ఉంటున్నట్లుగా తెలుసుకున్నారు.

ఇతడికి ఐదు కార్లు ఉన్నాయని.. అవన్నీ కూడా తనకు తెలిసిన వారి పేర్ల మీద కొన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇటీవల ఫుల్ గా తాగేసిన కారు డ్రైవ్ చేస్తుంటే.. డ్రంకెన్ డ్రైవ్ లో వాహనాన్ని రోడ్డు మీదే వదిలేసి పరారైనట్లుగా గుర్తించారు. తర్వాతి రోజున తన అనుచరుల్లో ఒకరికి రూ.లక్ష ఇచ్చి..కారు నడిపినట్లుగా పోలీసులకు చెప్పే ప్రయత్నం చేసినా.. పోలీసులు ఆ మోసాన్ని గుర్తించినట్లుగా తేలింది.

ఇప్పటివరకు అతడి నేర చిట్టాలో 23 ఇంజినీరింగ్ కాలేజీల్లో చోరీ చేసినట్లుగా తేల్చారు అన్నిచోట్ల ఉదయం వేళలో రెక్కీ చేసినట్లుగా తేలింది. ఇటీవల గోవాకు వెళ్లాడని తేలింది. ఏం చేసైనా సరే.. గోవాలో ఒక హోటల్ కట్టాలన్నది అతడి లక్ష్యంగా చెబుతున్నారు. శనివారం సాయంత్రం ప్రిజం పబ్ వద్ద కాల్పులు జరపడానికి ముందు ప్రభాకర్ ను స్కోడా కారులో డ్రాప్ చేసి రంజిత్.. రోహిత్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నిందితుడు ఉండే ప్లాటు.. కాల్పులు జరిగిన పబ్ వద్ద సీసీ కెమెరాలన్నీ పరిశీలిస్తున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రభాకర్ లైఫ్ స్టైల్ ఇంత విలాసవంతంగా ఉంటే.. మరోవైపు అతడి తండ్రి చిత్తూరు జిల్లా సోమల మండలంలో ఉంటారని తేలింది. తన తల్లిదండ్రులు చనిపోయారని చెప్పుకునే ఇతడి తండ్రి ఇప్పటికి అక్కడే ఉన్నారు. కటిక పేదరికంతో ప్రభుత్వం ఇచ్చే పింఛను.. రేషన్ బియ్యంతో బతుకునీడుస్తున్నారు. గుడి వద్ద భిక్ష మెత్తుకుంటూ ఉండే అతను.. తన కొడుకు తనను ఎప్పుడో వదిలేశాడని వాపోయాడు. రోజువారీగా తినేందుకు సైతం గతి లేని తండ్రిని వదిలేసి.. జల్సాలతో.. విలాసాలతో బతికే ప్రభాకర్ తీరు పోలీసుల వర్గాల్లో సైతం హాట్ చర్చగా మారింది.