ప్రజ్ఞానంద్ చెస్ మాస్టర్స్ ఛాంపియన్… గుకేశ్‌పై ఘన విజయం!

భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద్ తన అద్భుతమైన ప్రదర్శనతో టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. నెదర్లాండ్స్‌లో జరిగిన ఫైనల్లో ప్రపంచ చెస్ ఛాంపియన్ డి. గుకేశ్‌పై విజయం సాధించి ఈ ఘనత అందుకున్నాడు. మొదటి రౌండ్‌లోనే గుకేశ్‌ను ఒత్తిడికి గురిచేస్తూ, టైబ్రేకర్ పోరులో తన దిట్టమైన ఆటతీరును ప్రదర్శించాడు. దీంతో భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ టోర్నమెంట్‌ను గెలిచిన రెండో భారతీయుడిగా ప్రజ్ఞానంద్ నిలిచాడు.

టాటా స్టీల్ మాస్టర్స్ పోటీలో ప్రపంచ నెంబర్ వన్ చెస్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్‌సెన్‌ను వెనక్కి నెట్టి భారత యువ ఆటగాళ్లు ఫైనల్లో తలపడటం ప్రత్యేకంగా మారింది. గుకేశ్, ప్రజ్ఞానంద్ ఇద్దరూ సమాన స్థాయిలో బలమైన ఆటను ప్రదర్శించగా, చివరికి టైబ్రేకర్‌లో ప్రజ్ఞానంద్ పైచేయి సాధించాడు. ఈ విజయం ద్వారా ప్రజ్ఞానంద్ అంతర్జాతీయ చెస్ రంగంలో మరో మెట్టు ఎక్కినట్లయింది.

వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్‌ను గెలిచిన గుకేశ్, తన ఫామ్‌ను కొనసాగిస్తాడని భావించినప్పటికీ, ప్రజ్ఞానంద్ చూపిన దూకుడు అతనికి శాపంగా మారింది. ఓటమి చెందగానే అతను ఒక్కసారిగా అప్సెట్ అయ్యాడు. తుది పోరులో అద్భుతమైన మైండ్గేమ్‌తో గుకేశ్‌ను చిత్తు చేసిన ప్రజ్ఞానంద్, చెస్ ప్రపంచంలో తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. విశ్వనాథన్ ఆనంద్ 2006లో ఈ టైటిల్‌ను గెలుచుకోగా, మళ్లీ 19 ఏళ్ల తర్వాత ప్రజ్ఞానంద్ భారతీయ గ్రాండ్‌మాస్టర్‌గా ఈ ఘనతను సాధించడం విశేషం.

ఈ విజయంపై దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ ప్రజ్ఞానంద్‌ను ప్రశంసిస్తూ, దేశంలో యువ గ్రాండ్‌మాస్టర్స్ సంఖ్య పెరుగుతుండడం గర్వించదగిన విషయమని పేర్కొన్నారు. భారత చెస్ ప్రపంచంలో కొత్త తరం ఆటగాళ్లు అంతర్జాతీయంగా భారత పేరు నిలబెట్టేందుకు సిద్ధమవుతున్నారని ఈ విజయం మరింత స్పష్టం చేసింది.