వరల్డ్ క్రికెట్ హిస్టరీలో ఎక్కువగా క్రేజ్ ఉండే ఒకే ఒక్క క్లాష్ భారత్ vs పాకిస్థాన్. లైవ్ బ్రాడ్ క్యాస్ట్ లో అత్యధిక వ్యూవర్షిప్ సాధించిన మ్యాచ్ లలో ఎక్కువగా ఈ రెండిటి మధ్యలో జరిగినవే. ఇక ఫ్యాన్స్ మధ్యలో ఉండే వాతావరణం ఎంత ఘాటుగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమధ్య కాలంలో ఆటగాళ్లు కాస్త స్పోర్టివ్ గా స్నేహంగానే ఉన్నప్పటికీ ఒకప్పుడు ఇంజమామ్, ఆఫ్రిది లాంటి ఆటగాళ్లపై గంభీర్, జహీర్ ఖాన్ లాంటి భారత ఆటగాళ్లు గుర్రుగా ఉండేవారు.
అయితే మారుతున్న కాలానికి తగ్గట్టుగా దాయాదుల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఆటగాళ్ల మధ్య కూల్ వాతావరణం కనిపిస్తుంది. అయితే ఈ తరహా స్నేహం మంచిది కాదని కొందరు సీనియర్ ఆటగాళ్లు కామెంట్ చేయడం వైరల్ అవుతోంది. ముఖ్యంగా పాక్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ తన తాజా వ్యాఖ్యలతో క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు.
భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ల్లో తమ ఆటగాళ్లు ప్రత్యర్థులతో స్నేహపూర్వకంగా మెలగడం సరైనదికాదని ఆయన సూచించారు. ప్రొఫెషనలిజానికి కొన్ని హద్దులు ఉండాలని, మైదానంలో కేవలం గెలుపుపైనే దృష్టి పెట్టాలని హెచ్చరించారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఫిబ్రవరి 23న భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
తాజా మ్యాచ్‌లను గమనిస్తుంటే, పాక్ ఆటగాళ్లు భారత్ క్రికెటర్లను గౌరవించడమే కాకుండా వారితో అతి స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్నారని, ఇది ఆత్మవిశ్వాసం కోల్పోయేలా మారుతుందన్నారు. బ్యాట్స్‌మెన్ క్రీజులోకి వచ్చినప్పుడు బ్యాట్ చెక్ చేయడం, వారి భుజాలను తట్టి ప్రోత్సహించడం వంటి చర్యలు ఎందుకు చేస్తున్నారో తనకు అర్థం కావడంలేదని చెప్పారు.
తమ తరంలో సీనియర్ ఆటగాళ్లు ఎప్పుడూ భారత్‌తో మ్యాచ్ ఆడేటప్పుడు ఎలాంటి మినహాయింపులు ఇవ్వొద్దని చెప్పేవారని, కనీసం వారి ఆటతీరును మెచ్చుకోవడానికైనా అవకాశమివ్వకూడదని సూచించేవారని వెల్లడించారు. పోటీదారులను గౌరవించడం తప్పుకాదని, కానీ మైదానంలో వారితో అనవసరమైన స్నేహభావం ప్రదర్శించడం తమ బలహీనతగా మారుతుందని హెచ్చరించారు.
ప్రస్తుత ఆటగాళ్లు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. అంతేకాదు, మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ప్రొఫెషనలిజం అనేది కొనసాగాలని, వ్యక్తిగత సంబంధాలకు అక్కడ చోటుండకూడదని మొయిన్ ఖాన్ అభిప్రాయపడ్డారు.
భారత ఆటగాళ్లతో కలిసి ఫొటోలు దిగడం, సరదాగా మాట్లాడడం వంటి ప్రవర్తన వల్ల మైదానంలో ఆటపైనా ప్రతికూల ప్రభావం చూపిస్తుందని అన్నారు. గతంలో పాక్ క్రికెటర్లు పూర్తిగా ఆటపైనే దృష్టి పెట్టేవారని, ప్రస్తుతం ఆటగాళ్లు ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారని పేర్కొన్నారు. భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లకు విశేష క్రేజ్ ఉండటంతో, ఇలాంటి వ్యాఖ్యలు క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి.
అయితే, ఆటను కేవలం గెలుపోటముల కోణంలో చూడకూడదని భావించే వారు మొయిన్ ఖాన్ వ్యాఖ్యలతో విభేదిస్తున్నారు. రెండు జట్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని, ఆటను ఆస్వాదించే దిశగా వెళ్లాలని కొందరు విశ్లేషకులు అంటున్నారు. మరి ఫిబ్రవరిలో జరిగే మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు ఈ సూచనలను పాటిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం.
Gulte Telugu Telugu Political and Movie News Updates