భారత 76వ గణతంత్ర వేడుకలు ఆదివారం దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన వేడుకలు దేశ ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఎగురవేయగా… ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రుల, విపక్ష నేతలు, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ వేడుకలను తిలకించారు. ఈ సందర్బంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఢిల్లీకి వచ్చిన శకటాలు ఆకట్టుకున్నాయి.
ఈ శకటాల్లో ఏపీకి చెందిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏపీకి చెందిన ఏటికొప్పాక బొమ్మలతో రూపొందించిన శకటం.. అక్కడికి వచ్చిన వారిని విశేషంగా ఆకట్టుకుంది. ఏటికొప్పాక బొమ్మలతో రాష్ట్ర ప్రభుత్వం దిశానిర్దేశంలో రూపొందిన ఈ శకటం నిండా… రంగు రంగుల బొమ్మలు దర్శనమిచ్చాయి. అదే సమయంలో విశిష్ట ఆకృతుల్లో రూపొందిన బొమ్మల ఆకారాలు కూడా ఆకట్టుకున్నాయి. ఏటికొప్పాక బొమ్మలతో శకటం అలా కదులుతూ ఉంటే.. అందుకు అనుగుణంగా చిన్నారులు చేసిన నృత్యాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
400 ఏళ్ల చరిత్ర కలిగిన ఏటికొప్పాక బొమ్మలకు విశేష ప్రాదాన్యం ఉంది. చెట్ల నుంచి తీసిన సహజసిద్ధమైన రంగులతో చెక్కతోనే ఈ బొమ్మలను ఏటికొప్పాక కళాకారులు రూపొందిస్తున్నారు. ఈ కారణంగానే చిన్న పిల్లలు ఆడుకునేందుకు ఈ బొమ్మలకే అత్యధిక ప్రాధాన్యం లభిస్తోంది. చెక్కతో పాటుగా ఈ బొమ్మలకు వాడే దాదాపుగా అన్ని రకాల వస్తువులు కూడా మొక్కల నుంచి తీసినవే వాడటం ఏటికొప్పాక ప్రత్యేకత. గత టీడీపీ ప్రభుత్వం ఏటికొప్పాకకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన నేపథ్యంలో 2017లో ఈ కళకు జియో ట్యాగింగ్ కూడా దక్కింది.