బిచ్చం వేసిన వ్యక్తిపై కేసు.. ఇండోర్ పోలీసుల తీరుతో షాక్!

కొత్త చట్టాల్ని చేసినప్పుడు.. వాటికి సంబంధించిన ప్రచారం పెద్ద ఎత్తున జరగాలి. అదేం లేకుండా.. చట్టం చేశాం.. మీకు తెలీదా? అంటూ కేసులు నమోదు చేసే పోలీసులు కొందరుంటారు.ఆ కోవలోకే వస్తుంది ఇండోర్ పోలీసుల తీరు చూస్తే.. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరాన్ని యాచక రహిత నగరంగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఇండోర్ అధికార యంత్రాంగం బిచ్చం వేయటాన్ని నిషేధిస్తూ.. పలువురు బిచ్చగాళ్లను పునరావాస కేంద్రాలకు తరలించారు.

ఇదిలా ఉండగా ఒక దేవాలయం ఎదుట ఉన్న ఒక యాచకురాలికి బిచ్చం వేసిన వ్యక్తిపై భారతీయ న్యాయ సంహిత లోని సెక్షన్ 223 కింద కేసు నమోదు చేశారు. పోలీసులు నమోదు చేసిన ఈ నేరం నమోదు అయితే.. సదరు వ్యక్తికి ఏడాది వరకు జైలుశిక్ష కానీ రూ.5 వేల జరిమానా కానీ లేదంటే ఈ రెండు శిక్షల్ని అమలు చేసే వీలుంది. ఇండోర్ లో యాచకులకు దానం చేయటాన్ని బ్యాన్ చేస్తూ జనవరి ఒకటి నుంచి నిర్ణయం తీసుకున్నారు.

అంతేకాదు.. ఎక్కడైనా ఎవరైనా భిక్షాటన చేస్తుంటే.. వారి సమాచారాన్ని ఇస్తే రూ.వెయ్యి ఇస్తామని ప్రకటించారు. గడిచిన మూడు వారాలుగా ఇండోర్ నగరంలో పలువురు ఈ రివార్డును అందుకున్నారు. కేంద్ర సామాజిక న్యాయ.. సాధికార మంత్రిత్వ శాఖ దేశంలోని పది నగరాల్ని ఈ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఇందులో ఇండోర్ తో పాటు డిల్లీ.. బెంగళూరు.. చెన్నై.. హైదరాబాద్ నగరాలు ఉన్నాయి. మొదట ఇండోర్ లో పైలెట్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత.. దశల వారీగా మిగిలిన నగరాలకు ఈ విధానాన్ని అమలు చేయనేున్నారు.