అసలే గంజాయిపై ఏపీలోని కూటమి సర్కారు యుద్ధమే ప్రకటించింది. ఫలితంగా ఎక్కడికక్కడ పోలీసులు వాహనాల తనిఖీలు కొనసాగిస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన వాహనాలను నడిరోడ్డుపై నిలిపేసి క్షుణ్ణంగా తనీఖీలు చేస్తున్నారు. ఇందుకోసం ఎక్కడికక్కడ పోలీస్ చెక్ పోస్టులు వెలిశాయి. ఏ ప్రధాన రహదారిని చూసినా ఈ చెక్ పోస్టులే దర్శనమిస్తున్నాయి. ఎంత నిర్బంధమున్నా… కేటుగాళ్లు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతూ ఉంటారు కదా. అదేదో పుష్ఫ సినిమాలో పాల వ్యాన్ లో ఎర్రచందనాన్ని తరలించినట్లుగా… గంజాయి తరలింపునకు కేటుగాళ్లు ఓ ఐడియాను కనిపెట్టారు. అయితే ఆ ఐడియాకూ పోలీసులు చెక్ పెట్టేశారు.
అయినా సినిమాలను తలపించేలా గంజాయి అక్రమ రవాణాదారులు ఎలాంటి మార్గాలను ఎంచుకున్నారన్న విషయానికి వస్తే.. ప్రముఖ మీడియా సంస్థలకు చెందిన లోగోలను గంజాయి కేటుగాళ్లు ముందుగానే రూపొందించుకున్నారు. మీడియా సంస్థలు వినియోగించే వాహనాల తరహా వాహనాలను ఎంచుకున్నారు. ఎంచక్కా… ఆ వాహనాలపై మీడియా సంస్థల లోగోలను అంటించేశారు. ఆ వాహనాల నిండా గంజాయి బస్తాలను కుక్కేశారు. ఇంకేముంది… ఎంచక్కా పోలీసు చెక్ పోస్టులను దాటుకుంటూ అలా అలా సాగిపోయారు. అయితే అన్ని చెక్ పోస్టుల వద్ద ఒకే తరహా పోలీసు అదికారులు ఉండరు కదా. ఒక్కో చోట పుష్ప సినిమాలోని పోలీసు అధికారి గోవిందప్ప మాదిరి అధికారులూ ఉంటారు కదా.
నర్సీపట్నం వద్ద అలాంటి అధికారే ఒకరు చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తున్నారు. ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ లోగోను పెట్టుకున్న ఓ వాహనం అక్కడికి దూసుకువచ్చింది. పోలీసులంతా దానిని చూసి…మీడియా వాహనం కదా పంపించేద్దామనుకున్నారు. అయితే ఆ పోలీసు అధికారి మాత్రం ఓ సారి తనిఖీ చేసి పంపండి అంటూ ఆర్డరేశారు. దీంతో ఒకింత భయంభయంగానే మీడియా వాహనాన్ని పోలీసులు తనీఖీ చేయగా.. వారంతా విస్తుపోయారు. ఎందుకంటే… లోగోను చూస్తే అది మీడియా వాహనంగానే కనిపించినా.. దాని లోపల నిండా గంజాయి బస్తాలే ఉన్నాయి. విషయాన్ని గ్రహించిన పోలీసు అధికారి సదరు వాహనాన్ని సీజ్ చేసి అందులో గంజాయిని తరలిస్తున్న వారిని అరెస్ట్ చేశారు.
ఈ తరహా నయా అక్రమ తరలింపు ఇప్పుడే ప్రప్రథమంగా జరగలేదు. గతంలో ఓ రాజకీయ పార్టీ అదినేత ఫ్యామిలీ ఆధ్వర్యంలోని మీడియా సంస్థ లోగోలు పెట్టుకుని కొందరు వ్యక్తులు ఏకంగా ఎర్రచందనాన్ని తరలిస్తూ పట్టుబడిపోయారు. అంతేకాకుండా ఎన్నికల వేళ… నిబంధనలకు విరుద్ధంగా నగదును తరలించేందుకు కూడా సదరు మీడియా సంస్థ లోగోలను సదరు రాజకీయ నేత అనుచరులు యధేచ్ఛగా వినియోగించారు. అప్పుడు కూడా పలు వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. మరి పుష్ప సినిమాను చూసో… లేదంటే ఈ మీడియా సంస్థ లోగోలతో చేసిన నిర్వాకం గుర్తుకు వచ్చో ఇప్పుడు గంజాయి అక్రమ తరలింపుదారులు మీడియా లోగోలను వాడేస్తున్నారు. అయితే తాజాగా నర్సీపట్నం వద్ద ఈ టెక్కిక్ బయటపడిపోవడంతో ఇకపై మీడియా లోగోలు ఉన్నా… వాహనాలను తనిఖీ చేయనిదే పోలీసులు వదిలి పెట్టేలా లేరని చెప్పక తప్పదు.