రిలయన్స్ న్యూ కరెన్సీ.. జియో కాయిన్

ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు. అదే సమయంలో బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్ కూడా ఉండాలండోయ్. ఆ రెండూ ఉంటే… చేతిలో చిల్లగవ్వ లేకుండానే ప్రపంచాన్నే చుట్టేయొచ్చు. ఇప్పుడు ఆ బ్యాంకులో బ్యాలెన్స్ కూడా అవసరం లేదు… చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు అనే పరిస్థితి వస్తోంది. ఆ బ్యాంకు బ్యాలెన్స్ బదులుగా క్రిప్టో కరెన్సీ ఉంటే చాలు. అంటే… ఇటీవల బాగా ప్రాచుర్యం పొందిన బిట్ కాయిన్ లాంటివన్న మాట.

సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో అందరితో కలిసి పరుగులు తీస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడు క్రిప్టో బాట పట్టేసింది. ఇప్పటికే జియోతో తన వ్యాపార సామ్రాజ్యాన్ని గతంలో ఎన్నడూ లేనంతగా విస్తరించిన రిలయన్స్… తాజాగా తన సొంత కరెన్సీని రూపొందించింది. జియో కాయిన్ పేరిట వస్తున్న ఈ కరెన్సీ తొలుత జియో వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత దాని విస్తరణపై రిలయన్స్ ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తుందన్న దానిపై జియో కాయిన్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెప్పాలి.

జియో కాయిన్… పాలిగన్ ప్లాట్ ఫామ్ పై రూపొందించిన సరికొత్త క్రిప్టో కరెన్సీ. దీనిని జియో వినియోగదారులు జియో సేవలను వినియోగించడం ద్వారా రివార్డుల రూపంలో పొందవచ్చు. అంతేకాకుండా జియో సేవల కొనుగోలుకు ఈ జియో కాయిన్ లను ఎంచక్కా వాడేసుకోవచ్చ. అంతేకాకుండా ఈ జియో కాయిన్ లను మన కరెన్సీలోకి కూడా మార్చుకోవచ్చట. అయితే దీనికి కొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. అయినా జియో కాయిన్ విలువ ఎంతో తెలుసా?..ప్రస్తుతం ఒక్కో జియో కాయిన్ విలువ రూ.43తో సమానంగా ఉండే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

ఇక జియో కాయిన్ లను నేరుగా వినియోగించుకునే సౌలభ్యం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. జియో స్పియర్ పేరిట జియో నూతనంగా అభివృద్ధి చేసిన ఓ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే గానీ.. జియో కాయిన్ లను పొందడం, వినియోగించడం కుదరదు. ప్రారంభ దశలో ఇలాంటి కొన్ని షరతులు తప్పనిసరి అయినా… భవిష్యత్తులో జియో కాయిన్ ల వాడకాన్ని మరింతగా సరళతరం చేసే దిశగా రిలయన్స్ చర్యలు చేపట్టడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి.