ఏపీఎస్ఆర్టీసీకి సంక్రాంతి డబుల్ బొనాంజా

ఏపీలో ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో సంక్రాంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు హైదరాబాద్ సహా ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఏపీ ప్రజలు భారీ ఎత్తున తమ సొంతూళ్లకు తరలి వెళ్లారు. ఫలితంగా ఏపీకి దారి తీసే రహదారులన్నీ రద్దీతో కిటకిటలాడాయి. అదే సమయంలో జనాన్ని తమ సొంతూళ్లకు చేరవేసేందుకు శ్రమించిన ఏపీఎస్ఆర్టీసీకి డబుల్ లాభాలు దక్కాయి.

ఈ ఏడాది సంక్రాంతి వేడుకల కోసం హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి దాదాపుగా 5 లక్షల మంది వెళ్లారు. పండుగ సంబరాలు ముగించుకుని అంతే స్థాయిలో జనం తిరుగు ప్రయాణమయ్యారు. వెరసి వీరందరినీ అటు వారి సొంతూళ్లకు చేర్చడంతో పాటుగా వారిని తిరిగి వారి కార్య స్థానాలకు చేర్చేందుకు ఏపీఎస్ఆర్టీసీ ఏకంగా 9,097 బస్సులను నడిపింది. అంటే… దాదాపుగా 10 వేల సర్వీసులను వినియోగించిన ఆర్టీసీ… 10 లక్షల మంది ప్రయాణాలను పూర్తి చేసింది.

ఈ ప్రయాణాలకు గానూ ఏపీఎస్ఆర్టీసీకి ఏకంగా రూ.23.71 కోట్ల మేర ఆదాయం లభించింది. సంక్రాంతి పండుగకు జనాలు తమ ఊళ్లకు చేరడతోనే రూ.12 కోట్ల మేర ఆదాయం లభించిందని ఇదివరకే ఆర్టీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా తిరుగు ప్రయాణాలు కూడా పూర్తి కావడంతో… సంక్రాంతి ప్రయాణాలు ముగిశాయని ప్రకటించిన ఆర్టీసీ…ఈ సంక్రాంతికి తమకు డబుల్ బొనాంజా అందినట్లుగా ఏకంగా రూ.23.71 కోట్ల మేర ఆదాయం వచ్చినట్టు గర్వంగా ప్రకటించింది.