బుమ్రా లేని లోటును షమీ భర్తీ చేస్తాడా?

వరల్డ్ క్రికెట్ లో కీలక సిరీస్ గా పరిగణిస్తున్న చాంపియన్స్ ట్రోఫీకి మరెంతో సమయం లేదు. పిబ్రవరిలో ఈ సిరీస్ మొదలుకానుండగా… ఫేవరేట్ గా బరిలోకి దిగనున్న టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలినట్టైంది. టీమిండియా స్టార్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా ఈ సిరీస్ లో కీలకమైన లీగ్ మ్యాచ్ లకు దూరమైపోయాడు.

వెన్నెముక నొప్పి కారణంగా అతడికి విశ్రాంతి అవసరమని భావించిన బీసీసీఐ బెంగళూరులోని క్రికెట్ అకాడెమీకి వెళ్లాలని అతడికి సూచించింది. మార్చి తొలి వారానికి గానీ అతడు జట్టుకు అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది.

చాంపియన్స్ ట్రోఫీలో భారత్ తన చివరి మ్యాచ్ ని మార్చి 2న న్యూజిల్యాండ్ తో ఆడనుంది. అంటే… ఈ సిరీస్ లో చివరి గ్రూప్ మ్యాచ్ ముగిసే దాకా కూడా బుమ్రా జట్టుకు అందుబాటులో ఉండడన్నమాట. లీగ్ దశలో సత్తా చాటితేనే టైటిల్ వేటలో ఏ జట్టు అయినా తన అవకాశాలను సజీవంగా నిలబెట్టుకోగలదు.

వెరసి లీగ్ దశ ఏ జట్టుకైనా కీలకమనే చెప్పాలి. ఇలాంటితరుణంలో సీనియర్ మోస్ట్ బౌలర్ గా ఉన్న బుమ్రా టీమిండియాకు దూరం కావడం జట్టుకు అశనిపాతమేనని చెప్పాలి.

ఇదిలా ఉంటే… టీమిడియా మరో సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ తిరిగి షామ్ లోకి వచ్చేశాడు. పిట్ నెస్ సమస్యతో సతమతమవుతున్న షమీ చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్నాడు.అయితే ఇటీవలి కాలంలో నెట్స్ తీవ్రంగా శ్రమించిన షమీ… తిరిగి ఫిట్ నెస్ ను సాధించాడు.

ఇదే విషయాన్ని గ్రహించిన బీసీసీఐ అతడిని తిరిగి జట్టులోకి తీసుకుంది. ఈ నెల 22 నుంచి ఇంగ్లండ్ తో జరగనున్న టీ20 సిరీస్ కు అతడిని జట్టులోకి తీసుకుంది. అంటే… వచ్చే నెలలో మొదలు కానున్న చాంపియన్స్ ట్రోఫీకి కూడా అతడు జట్టుకు అందుబాటులో ఉంటాడన్న మాట.

చాంపియన్స్ ట్రోఫీ లాంటి కీలక సిరీస్ కు ముందు బుమ్రా గైర్హాజరీ, ఆ వెంటనే షమీ రాక వంటి రెండు భిన్న పరిణామాలను బీసీసీఐ చవిచూడటం గమనార్హం. ఇక్కడే క్రికెట్ లవర్స్ ను ఓ ప్రశ్న సతమతం చేస్తోంది. బుమ్రా లేకపోతే… అతడి స్థానాన్ని షమీ భర్తీ చేయగలడా అంటూ వారంతా ప్రశ్నించుకుంటున్నారు.

క్రికెట్ నిపుణులు కూడా ఇదే అంశంపై అంకెలతో కుస్తీ పడుతున్నారు. బుమ్రా అంతలా కాకున్నా… షమీ కూడా భారత జట్టుకు దొరికిన ఆణిముత్యమే. జట్టుకు అతడు చాలా విజయాలను అందించాడు కూడా. ఈ క్రమంలో బుమ్రా లోటును షమీ భర్తీ చేస్తాడనే ఆశిద్దాం.