ప్రపంచవ్యాప్తంగా హోటల్ బుకింగ్ ప్లాట్‌ఫారంగా గుర్తింపు పొందిన ఓయో ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మేజర్ వయసు ఉన్నవారెవరైనా ఐడీ ప్రూఫ్ చూపించి రూమ్ బుక్ చేసుకునే వెసులుబాటు ఉండేది. ప్రత్యేకంగా ప్రేమజంటలకు ఇది ఫస్ట్ ఆప్షన్‌గా నిలిచింది. అయితే నూతన సంవత్సరంలో ఓయో సీఈవో రితేశ్ అగర్వాల్ కొత్త రూల్స్ ప్రవేశపెట్టారు.
తాజాగా ప్రకటించిన మార్గదర్శకాలు ప్రకారం, ఇకపై ఓయోలో రూమ్ బుక్ చేసుకునే జంటలు తమ వివాహానికి సంబంధించిన ఆధారాలను చూపించాల్సి ఉంటుంది. పెళ్లి కాని జంటలకు రూమ్ ఇవ్వడం పూర్తిగా నిలిపివేస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. మీరట్ నగరంతో ఈ రూల్ అమలు ప్రారంభమవుతుందని, తర్వాత క్రమంగా దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ అమలు చేయనున్నట్లు రితేశ్ అగర్వాల్ వివరించారు.
ఓయో ప్రతినిధుల ప్రకటన ప్రకారం, ఈ కొత్త నిబంధనలు సంస్థ చొరవగా తీసుకున్న నిర్ణయం. కుటుంబాలు, విద్యార్థులు, ఒంటరిగా ప్రయాణించే వారికి సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యమని చెబుతున్నారు. అలాగే, హోటల్ బుకింగ్ వ్యవస్థను మరింత బాధ్యతాయుతంగా మార్చేందుకు ఈ చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమాల్లో ఈ కొత్త రూల్స్‌పై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తుండగా, మరికొందరు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యగా విమర్శిస్తున్నారు. ఇప్పటికే అప్పుల్లో ఉన్న ఓయో సంస్థ ఈ విధంగా రిస్క్ తీసుకోవడం షాకింగ్ అనే చెప్పాలి. మరి సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మార్కెట్లో ఏమేరకు ప్రభావం ఉంటుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates