డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రభావం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి ఒక్కరి జీవనశైలి సామాజిక మాధ్యమాలతో ముడిపడిపోయింది. చిన్నారులు సహా యువత, వృద్ధులు రోజువారీ జీవితంలో ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడుపుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఇది పలు ప్రయోజనాలను అందించినా, ఒకవైపు మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారుల డేటా రక్షణ, వారిపై సోషల్ మీడియా ప్రభావం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో, భారత ప్రభుత్వం డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ 2025ను ముసాయిదాగా విడుదల చేసింది. ఇందులో 18 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా ఖాతా తెరవడాన్ని కఠిన నిబంధనలతో పరిమితం చేయాలని ప్రతిపాదించింది. తల్లిదండ్రుల అనుమతి లేకుండా చిన్నారులకు సోషల్ మీడియా ఖాతాలను తెరవడానికి వీలులేకుండా నిబంధనలు రూపొందించబడుతున్నాయి. చిన్నారుల డేటాను ప్రాసెస్ చేయడానికి కూడా తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు.
నిబంధనల ప్రకారం, చిన్నారుల వ్యక్తిగత డేటా ప్రాసెసింగ్ పై పూర్తి నియంత్రణ తల్లిదండ్రులకే ఉంటుంది. డేటా భద్రతకు సంబంధించి కంపెనీలు మరింత పారదర్శకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. తమ సమాచారాన్ని కంపెనీలు ఎందుకు సేకరిస్తున్నాయో వినియోగదారులకు వివరణ ఇచ్చే బాధ్యత కంపెనీలపై ఉంటుంది. అదే సమయంలో, వినియోగదారులు తమ వ్యక్తిగత డేటాను తొలగించమని కోరే హక్కు కలిగి ఉంటారు. ఇకపోతే, ఈ నిబంధనలను ఉల్లంఘించిన సంస్థలపై కేంద్రం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. డేటా భద్రతా లోపాల వల్ల వినియోగదారులకు నష్టం కలిగితే, సంబంధిత సంస్థలకు రూ.250 కోట్ల వరకు జరిమానా విధించబడుతుంది. వినియోగదారుల భద్రత, వారి డేటా రక్షణే లక్ష్యంగా తీసుకువస్తున్న ఈ చట్టంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates