సిడ్నీ టెస్టు సందర్భంగా భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ తన భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చారు. గత కొంతకాలంగా హిట్ మాన్ రోహిత్ టెస్ట్ ఫార్మాట్ కు కూడా రిటైర్మెంట్ ఇవ్వనున్నట్లు అనేక రకాల గాసిప్స్ పుట్టుకొచ్చాయి. అలాగే వన్డే ఫార్మాట్ కు కూడా గుడ్ బై చెప్పనున్నట్లు కూడా నేషనల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇక ఫైనల్ గా రోహిత్ మౌనం వీడి వాటన్నిటిపై ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. జట్టులో తగిన మార్పులు అవసరమని, వ్యక్తిగత ప్రయోజనాలకంటే జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు.
సిడ్నీ టెస్టులో ఎందుకు ఆడలేదన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, అది జట్టు అవసరాలకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయమని, విశ్రాంతి తీసుకోవడం తన వ్యక్తిగత నిర్ణయం కాదని రోహిత్ స్పష్టం చేశారు. పెర్త్ టెస్టులో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ భాగస్వామ్యం చేసిన నేపథ్యంలో, ఆ జోడీని మార్చడం సరైనదేమీ కాదని చెప్పిన రోహిత్, ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌ను కొనసాగించడమే మంచిదని భావించామని వివరించారు.
కీలక టెస్టులో తాను ఆడకపోవడం సున్నితమైన నిర్ణయమే అయినప్పటికీ, జట్టు విజయం కోసం ఈ నిర్ణయం తప్పనిసరని చెప్పారు. ఫామ్ లేకపోవడం తాత్కాలికమేనని, మరింత కష్టపడి మంచి ప్రదర్శన చేయాలనే సంకల్పంలో ఉన్నానని రోహిత్ అన్నారు. మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్ల నుంచి స్లెడ్జింగ్ వచ్చినా, భారత ఆటగాళ్లు పరిమితంగానే స్పందిస్తారని చెప్పారు. ప్రత్యేకంగా, కొన్‌స్టాస్ – బుమ్రా వాగ్వాదం విషయమై టీమిండియా సభ్యులు శాంతి పాటించారని పేర్కొన్నారు.
తన రిటైర్మెంట్ పై వస్తున్న పుకార్లపై స్పందిస్తూ, అటువంటి నిర్ణయాలు తీసుకునే సమయంలో ఆలోచన చేసుకుంటానని, ఎవరి ఒత్తిడికీ లోనుకాకుండా తగిన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని రోహిత్ చెప్పారు. రాబోయే ఐదు నెలల్లో రోహిత్ మరోసారి తన ఫామ్‌ను కనబరిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.