బుమ్రాతో పెట్టుకుంటే వికెట్టే..

సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టులో మొదటి రోజు ఆట ఉత్కంఠగా ముగిసింది. ఆసీస్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 9 పరుగులు మాత్రమే చేసినప్పటికీ, ఆఖరి బంతికి బుమ్రా అద్భుత డెలివరీతో ఉస్మాన్ ఖవాజాను పెవిలియన్ పంపించాడు. స్లిప్‌లో కేఎల్ రాహుల్ పట్టిన సూపర్ క్యాచ్ భారత ఆటగాళ్ల సంబరాలకు కారణమైంది. ఇది చివరి బంతికి వికెట్ పడటం మాత్రమే కాదు, నాన్ స్ట్రైకర్ గా ఉన్న కొన్‌స్టాస్‌తో బుమ్రా మధ్య జరిగిన వాగ్వాదం కూడా ఆటను మరింత ఆసక్తికరంగా మార్చింది.

భారత్ బ్యాటింగ్ సమయంలోనే కొన్‌స్టాస్ తన దూకుడును ప్రదర్శించాడు. బుమ్రా బౌలింగ్ మొదటి బంతినే బౌండరీకి పంపి, వెంటనే మ్యాచ్ రసవత్తరంగా మారుతుందని సూచించాడు. అనంతరం బుమ్రా బౌలింగ్ చేస్తున్నప్పుడు ఖవాజా స్ట్రైకింగ్‌కి ముందుకు రావడంతో చిన్నపాటి వివాదం చోటుచేసుకుంది. కాస్త పొగరుగా నాన్ స్ట్రైక్ లో ఉన్న కొన్‌స్టాస్ మాటలకు బుమ్రా తగిన సమాధానం ఇచ్చినా, అంపైర్ మద్యవర్తిత్వంతో గొడవ సర్దుబాటు అయింది. ఆ వెంటనే బుమ్రా కొన్‌స్టాస్ పైన ఉన్న కోపాన్ని మొత్తం స్ట్రైకింగ్ లో ఉన్న ఖవాజాపై చూపించాడు. అతను వేసిన బంతికి ఖవాజా స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి ఔట్ కావడంతో, బుమ్రా సత్తా మరోసారి నిరూపితమైంది. ఇక బుమ్రా వెంటనే కొన్‌స్టాస్ కు కౌంటర్ ఇచ్చేలా అరిచేశాడు. వీరి మధ్య వివాదం మ్యాచ్ కు హైలెట్ అయ్యింది.

భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకే ఆలౌటైంది. రిషభ్ పంత్ (40) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. యశస్వి జైస్వాల్ 10, కేఎల్ రాహుల్ 4, గిల్ 20, విరాట్ కోహ్లీ 17, రవీంద్ర జడేజా 26 పరుగులు చేసినా, ఆసీస్ బౌలర్లు బోలాండ్ (4 వికెట్లు), స్టార్క్ (3 వికెట్లు), కమిన్స్ (2 వికెట్లు) భారత బ్యాటింగ్‌ను కట్టడి చేశారు. బుమ్రా చివరిలో 22 పరుగులు చేసినప్పటికీ, ఇతర బ్యాటర్లు సరిగ్గా రాణించలేకపోయారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి, భారత్ బౌలింగ్ దూకుడుగా కనిపించింది. ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ను శాసించే ప్రయత్నంలో, బుమ్రా తన అద్భుత డెలివరీలతో మరోసారి ప్రభావం చూపించాడు. రెండో రోజు ఆట భారత్‌కు కీలకంగా మారనుంది. ఆసీస్ తక్కువ స్కోరుకే ఆలౌటైతే మ్యాచ్ మరో మలుపు తిరిగే అవకాశముంది.