జూలై 31 వరకు వర్క్‌ ఫ్రం హోం

IT Employees
IT Employees

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల‌కు గుడ్ న్యూస్‌. క‌రోనా క‌ష్టాల స‌మ‌యంలో అందుబాటులోకి వ‌చ్చ‌ని వెసులుబాటు విష‌యంలో మ‌రింత తీపిక‌బురు. లాక్ డౌన్ ఇబ్బందులకు దూర‌మ‌య్యేలా వ‌ర్క్ ఫ్రం హోం సౌల‌భ్యం సౌల‌భ్యం కొన‌సాగుతోంది. వ‌ర్క్ ఫ్రం హోం జూలై 31 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం ప్రక‌టించింది.

కేంద్ర ఐటీ, న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ ఢిల్లీ నుంచి అన్ని రాష్ర్టాల ఐటీ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా వైరస్‌ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు, ఐటీ పరిశ్రమపై కొవిడ్‌-19 ప్రభావం, కొత్త టెక్నాలజీ వినియోగం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. కొవిడ్‌-19 వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ఇళ్ల‌ నుంచి విధులు (వర్క్‌ ఫ్రం హోం) నిర్వర్తించేలా ఐటీ, బీపీవో సంస్థల సిబ్బందికి గతంలో కల్పించిన వెసులుబాటును జూలై 31 వరకు పొడిగిస్తున్నట్టు రవిశంకర్‌ప్రసాద్‌ వెల్లడించారు. ‌క‌టించి టెకీల‌కు ఊర‌ట ఇచ్చింది.

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ఈ సంద‌ర్భంగా ప‌లు కీల‌క ప్ర‌తిపాద‌న‌లు పెట్టారు. చైనా నుంచి తమ తయారీ యూనిట్లను ఇతర దేశాలకు తరలిస్తున్నట్టు జపాన్‌ లాంటి దేశాలు ఇప్పటికే బహిరంగంగా ప్రకటించిన విషయాన్ని మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా గుర్తుచేస్తూ.. ఇలాంటి పరిశ్రమలను, ముఖ్యంగా ఐటీ సంబంధిత ఎలక్ట్రానిక్‌ పరిశ్రమలను భారత్‌కు రప్పించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. అలా చేయగలిగితే దేశంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయన్నారు.

ప్రస్తుతం అనేక కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం సౌకర్యాన్ని కల్పిస్తున్నాయని, ఈ విధానం భవిష్యత్తులోనూ కొనసాగే అవకాశమున్నందున సైబర్‌ సెక్యూరిటీ రంగంలో ఉపాధి అవకాశాలు మరింత పెరిగే అవకాశమున్నదని తెలిపారు. దీనిపై దృష్టిసారించాలని కేంద్రానికి సూచించారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రజలు విరివిగా ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్న నేపథ్యంలో బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరమున్నదని, ఈ విషయంలో కేంద్రం మరింత చొరవ చూపాలని అన్నారు.