‘పోస్ట్ నో ఈవిల్’, న‌గ‌రాల్లో పోస్ట‌ర్లు పెట్టిన ఏపీ ప్ర‌భుత్వం

వైసీపీ హ‌యాంలో దారి త‌ప్పిన వ్య‌వ‌స్థ‌ల‌ను గాడిలో పెడుతున్నామ‌ని ప‌దే పదే చెప్పిన సీఎం చంద్ర‌బా బు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు నిజంగానే ఆ ప‌ని చేస్తున్నారు. ఇప్పటికి అంత‌ర్గ‌తంగా కొన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను దారిలోకి తీసుకువ‌చ్చారు. ఇక‌, ఇప్పుడు తాజాగా సోష‌ల్ మీడియా ను కూడా సంస్క‌రించే ప‌నిని ప్రారంభించారు. వైసీపీ హ‌యాంలో సోష‌ల్ మీడియా అంటే.. బూతుల‌కు, దుర్బాష‌ల‌కు, ప‌రుష కామెంట్ల‌కు వేదిక‌గా మారిపోయాయ‌న్న విమ‌ర్శ‌లు వున్నాయి.

నాయ‌కుల‌పైనా, పార్టీల‌పైనే కాకుండా వారి కుటుంబ స‌భ్యుల‌పైనా తీవ్ర విమర్శ‌లు చేసిన నెటిజ‌న్లు ఉన్నారు. వీరంద‌రినీ ఇప్పుడు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు.. సోష‌ల్ మీడియాలో ఒక్క నాయ‌కుల‌పైనే కాదు.. సొంత వ్య‌వ‌హారాలు స‌హా.. యువ‌తులపైనా.. మ‌హిళ‌ల‌పైనా కామెంట్లు చేయ‌కుం డా క‌ట్ట‌డి చేస్తున్నారు. వైసీపీ హ‌యాంలో ఇష్టానుసారంగా మారిపోయిన సోష‌ల్ మీడియాను ఇప్పుడు ప్ర‌జా ప్ర‌యోజ‌న మాధ్య‌మంగా మలిచేందుకు, యువ‌త‌లో మార్పు తెచ్చేందుకు కూట‌మి స‌ర్కారు ప్ర‌త్యేక ప్ర‌చారం చేప‌ట్టింది.

దీనిలో భాగంగా ప్ర‌ధాన కూడ‌ళ్లు.. ర‌హ‌దారుల‌పై భారీ ఎత్తునప్ర‌భుత్వ ఖ‌ర్చుతో పోస్ట‌ర్ల‌ను ఏర్పాటు చేసిం ది. విజ‌య‌వాడ‌, అమ‌రావ‌తి, విశాఖ‌, తిరుప‌తి, రాజ‌మండ్రి తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లోని ప్ర‌ధాన న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల‌తోపాటు క‌డ‌ప‌లోనూ ఈ పోస్ట‌ర్ల‌ను విరివిగా ఏర్పాటు చేశారు. చెడు వినొద్దు, చెడు కనొద్దు, చెడు మాట్లాడవద్దనే గాంధీజీ సూక్తి తో ఈ ప్ర‌చారం ప్రారంభించారు. ఈ పోస్ట‌ర్ల‌పై మూడు కోతుల బొమ్మ‌లు కూడా ముద్రించారు. సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌క‌ర‌, చెడు పోస్టులు వద్దంటూ ఆసక్తికరంగా హోర్డింగులను మ‌లిచారు.

“పోస్ట్ నో ఈవిల్” పేరుతో ఫోర్త్ మంకీ బొమ్మతో హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ర‌హ‌దారులు, ప్ర‌ధాన కూడ‌ళ్ల వ‌ద్ద ఏర్పాటు చేసిన ఈ పోస్ట‌ర్ల‌ద్వారా “మేక్ సోషల్ మీడియా ఎ పాజిటివ్ ఎక్స్‌పీరియ‌న్స్‌` అనే నినాదాన్ని ప్ర‌చారం చేయ‌నున్నారు. త‌ద్వారా సోష‌ల్ మీడియాను అత్య‌వ‌స‌ర సేవ‌లు, విలువైన స‌మాచారం, శుభాకాంక్ష‌లు, ధ‌న్య‌వాదాలు తెలుపుకునేలా వినియోగించాల‌ని.. అభ్యంత‌క‌ర మెసేజ్‌ల కోసం కాద‌ని స‌ర్కారు నేరుగా స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. ఇలా.. తొలిసారి ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నించ‌డం ప‌ట్ల స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది.