ఐపీఎల్‌లో చెన్నై రికార్డు పోయినట్లేనా?

ఇండియన్ ప్రిమియర్ లీగ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. నాలుగు సార్లు టైటిల్ విజేతగా నిలిచిన ముంబయి తర్వాత మూడు టైటిళ్లతో రెండో స్థానంలో ఉండటమే కాదు.. టోర్నీ ఆరంభం నుంచి ఆడిన ప్రతి సీజన్లోనూ ప్లేఆఫ్ చేరిన ఏకైక జట్టు చెన్నైయే. ఈ విషయంలో ముంబయి సైతం చెన్నై కంటే వెనుకే ఉంది.

రెండేళ్ల నిషేధం తర్వాత 2018లో పెద్దగా అంచనాల్లేకుండా లీగ్‌లో బరిలోకి దిగిన చెన్నై.. ఏకంగా టైటిల్ గెలిచిన ఆశ్చర్యపరిచింది. గత ఏడాది కూడా ఫైనల్‌ చేరిన ఆ జట్టు.. ముంబయి చేతిలో ఓటమి పాలైంది. ఐతే ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయిని ఓడిస్తూ టోర్నీని ఘనంగా ఆరంభించిన చెన్నై.. ఆ తర్వాత పేలవ ప్రదర్శన చేస్తోంది. మధ్యలో డుప్లెసిస్, వాట్సన్ చెలరేగి ఆడి అందించిన 10 వికెట్ల విజయాన్ని మినహాయిస్తే దానికి ముందు, వెనుక పేలవ ప్రదర్శన చేసింది చెన్నై.

ఇప్పటిదాకా చెన్నై ఏడు మ్యాచ్‌లు ఆడితే అందులో గెలిచింది రెండు మాత్రమే. ఐదు మ్యాచ్‌లు ఓడిపోయింది. ఈ ఓటములకు మించి ఓడిన తీరు చెన్నై అభిమానులకు ఆందోళన కలుగుతోంది. ఆ జట్టు బౌలింగ్ బాగున్నా.. బ్యాటింగ్‌లో తేలిపోతోంది. ముఖ్యంగా ఓపెనర్లు ఆడితే ఆడినట్లు. లేదంటే లేదు. డుప్లెసిస్, వాట్సన్ ఫెయిలైతే జట్టు తేలిపోతోంది. రాయుడు ఓ మోస్తరుగా ఆడుతున్నా.. అతడికి సరైన సహకారం అందట్లేదు. మిడిలార్డర్లో ధాటిగా ఆడే బ్యాట్స్‌మన్ కనిపించడం లేదు. ఎక్కువగా ఆ జట్టు ఛేజింగే చేస్తోంది. ఓపెనర్లు వెనుదిరిగాక మిగతా బ్యాట్స్‌మెన్ మరీ నెమ్మదిగా ఆడుతున్నారు. దీంతో సాధించాల్సిన రన్‌రేట్ పెరిగిపోతూ వస్తోంది. చివర్లో ఎంత వేగం పెంచినా రన్‌రేట్‌ను అందుకోలేకపోతున్నారు. దీంతో ఓటములు తప్పట్లేదు.

కెప్టెన్ ధోని వైఫల్యం జట్టుకు పెద్ద సమస్యగా మారింది. చూస్తుంటే చెన్నై రాత మారే సూచనలు ఎంతమాత్రం కనిపించడం లేదు. ఈసారికి ప్లేఆఫ్ ఆశలు వదులుకోక తప్పేలా లేదు. ఐపీఎల్‌లో ఆడిన ప్రతిసారీ ప్లేఆఫ్ చేరిన జట్టుగా చెన్నై రికార్డు పోవడం ఖాయంగా కనిపిస్తోంది. చెన్నై మిగిలిన ఏడు మ్యాచ్‌ల్లో కనీసం ఆరు గెలిస్తేనే ప్లేఆఫ్ బెర్తు ఖాయమవుతుంది. ఐదు గెలిచినా ఛాన్సుంటుంది కానీ.. అందుకు వేరే సమీకరణాలు కలిసి రావాలి. ఇక నుంచి గొప్పగా పుంజుకుని ఏమైనా అద్భుతాలు చేస్తుందేమో చూడాలి.