అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించి, ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ విజయంతో భారత్ అండర్-19 క్రికెట్‌లో తన శక్తిని మరోసారి నిరూపించింది. కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది.
ఓపెనర్లు కమిలిని (5), సానికా చల్కే (0)లు విఫలమవడంతో ఇన్నింగ్స్ దూకుడు కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ గొంగడి త్రిష (52) హాఫ్ సెంచరీతో రాణించి జట్టును గట్టెక్కించింది. కెప్టెన్ నికీ ప్రసాద్ (12), మిథిలా (17), ఆయుషి శుక్లా (10)లు తోడ్పాటునిచ్చారు. బంగ్లాదేశ్ బౌలర్లలో ఫర్జానా అక్తర్ అత్యుత్తమ ప్రదర్శనతో నాలుగు వికెట్లు తీసింది. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ బ్యాటింగ్ పూర్తిగా తడబడింది. భారత బౌలర్ల దాటికి 18.3 ఓవర్లలో 76 పరుగులకే ఆలౌటైంది.
జౌరియా ఫెర్డోస్ (22), ఫహోమిదా చోయా (18) మాత్రమే రెండంకెల స్కోరు చేయగా, మిగిలిన వారు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. భారత బౌలర్లలో ఆయుషి శుక్లా మూడు వికెట్లు పడగొట్టింది. సిసోదియా, సోనమ్ యాదవ్ లు చెరో రెండు వికెట్లు తీయగా, జోషిత ఒక వికెట్ సాధించింది. ఈ విజయంతో భారత అమ్మాయిలు తమ సమర్థతను ప్రపంచానికి చాటారు. అండర్-19 కేటగిరీలో భారత మహిళల జట్టు సాధించిన ఈ ఘనతకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. గెలుపు అందించిన గొంగడి త్రిష, ఆయుషి శుక్లా అద్భుతమైన ప్రదర్శనతో ప్రశంసలందుకున్నారు.