చట్టాలు భర్తను బెదిరించటానికి కాదు.. సుప్రీం కీలక వ్యాఖ్య

విడాకుల వేళ భార్యభర్తల మధ్య వచ్చే భరణం పేచీలతో పాటు. విడాకుల కేసుతో పాటు భర్త.. అతడి కుటుంబ సభ్యులపై నమోదయ్యే కేసులు.. అందులోనూ కొందరిపై నమోదయ్యే క్రిమినల్ ఛార్జ్ ల సంగతి తెలిసిందే. తాజాగా ఒక విడాకుల కేసుకు సంబంధించిన తుది ఆదేశాలు జారీ చేసే వేళ.. సంచలన వ్యాఖ్యలు చేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం. అంతేకాదు.. చట్టాలు మహిళల సంక్షేమం కోసమే తప్పించి భర్తలను శిక్షించటానికి.. బెదిరించటానికి కానే కాదంటూ తేల్చింది. భరణానికి సంబంధించి భార్య కోరిన భారీ డిమాండ్ ను తిరస్కరించటమే కాదు.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్య చేసింది.

భర్తలను బెదిరించి.. వారి ఆస్తిని గుంజుకోవటానికి కాదన్న విషయాన్ని తన ఆదేశాలతో సష్టం చేసిన సుప్రీం.. వివాహ వ్యవస్థను హిందువులు పవిత్రమైనదిగా.. కుటుంబాలకు బలమైన పునాదిగా భావిస్తారని పేర్కొంది. అదేం కమర్షియల్ వెంచర్ లాంటిది కాదన్న జస్టిస్ బీవీ నాగరత్న.. జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది. కేసు విషయానికి వస్తే.. తీవ్రమైన మనస్పర్థలతో విడివిడిగా ఉంటున్న దంపతుల వైవాహిక బంధాన్ని రద్దు చేస్తూ ధర్మాసనం తన నిర్ణయాన్ని వెల్లడించింది. అదే సమయంలో కింది కోర్టు పేర్కొన్నట్లుగా భరణాన్నినెల వ్యవధిలో చెల్లించాలని స్పష్టం చేసింది.

అదే సమయంలో భర్త మీదా.. అతడి కుటుంబ సభ్యుల మీద నమోదైన క్రిమినల్ కేసులను కొట్టేసింది. అంతేకాదు.. తన భర్తకు రూ.5వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని.. అతని తొలి భార్యకు రూ.500 కోట్లు భరణంగా ఇచ్చారు కనుక తనకూ అదే స్థాయిలో చెల్లింపులు జరపాలనన డిమాండ్ ను ధర్మాసనం తోసిపుచ్చింది. ఆమె కోరిన రూ.500 కోట్లు కాకుండా రూ.12కోట్ల భరణాన్ని ఖరారు చేస్తూ తన నిర్ణయాన్ని వెల్లడించింది. తన ఆదేశాల్ని జారీ చేసే క్రమంలో ఒక ఆసక్తికర వ్యాఖ్య చేసింది. విడాకులు తీసుకున్న తర్వాత మాజీ భర్తకు వ్యాపారంలో నష్టాలు వచ్చి దివాలా తీస్తే మాజీ భార్య వచ్చి ఆ కష్టాల్లో ఏమైనా భాగం పంచుుకుంటుందా? అని ప్రశ్నించింది.

భరణం కోసం బేరాలు ఆడేందుకు వీలుగా భర్త.. అతని కుటుంబ సభ్యులపై తీవ్రమైన నేరారోపణలు చేయటం పరిపాటిగా మారిందన్న ధర్మాసనం.. ఈ డిమాండ్లలో అత్యధికం ఆర్థికపరమైనవే ఉంటున్న విషయాన్ని పేర్కొంది. భార్య ఇచ్చిన కంప్లైంట్ తో రంగంలోకి దిగే పోలీసులు సైతం భర్త తరఫు బంధువుల్లో పెద్ద వయస్కుల్ని.. అనారోగ్యంతో ఉన్న వారిని సైతం అరెస్టు చేసి బెయిల్ రాకుండా చేస్తున్న అంశాలకు సంబంధించిన ఘటలన్నీ ఒకే చైన్ సిస్టమ్ మాదిరి ఉంటున్నట్లుగా పేర్కొంది. మొత్తంగా సుప్రీం తాజా ఆదేశాలు.. విడాకుల్ని కమర్షియల్ వెంచర్ గా భావించే వారికి గట్టి ఎదురుదెబ్బగా చెప్పక తప్పదు.