2021 డిసెంబర్ 8న త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఎంఐ-17 వీ5 హెలికాప్టర్ తమిళనాడులోని కూనూరులో కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్‌తో పాటు ఆయన భార్య మధులిక రావత్ అలాగే మరో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. ఇటీవల ఈ ఘటనపై రక్షణ శాఖ స్థాయి సంఘం తన నివేదికను లోక్ సభలో ప్రవేశపెట్టింది.
స్థాయి కమిటీ నివేదిక ప్రకారం, హెలికాప్టర్ ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని స్పష్టమైంది. పైలట్ నిర్ణయాల్లో వచ్చిన లోపాల వల్ల ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకున్నట్లు నివేదిక తెలిపింది. 2017-2022 మధ్య భారతీయ వైమానిక దళానికి చెందిన మొత్తం 34 విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. వీటిలో 2021-2022లో జరిగిన 9 ప్రమాదాల్లో, జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదం మానవ తప్పిదానికి తార్కాణమని తేల్చారు.
కూనూరులో జరిగిన ఈ ప్రమాదం అప్పట్లో దేశం మొత్తాన్ని కదిలించింది. జనరల్ బిపిన్ రావత్ భారతదేశ మొదటి త్రివిధ దళాధిపతిగా దేశ రక్షణ వ్యవస్థకు చేసిన సేవలు అనిర్వచనీయమని ప్రముఖులు పేర్కొన్నారు. ఈ నివేదికతో ఈ ప్రమాదం వెనుక కారణాలు బయటపడటమే కాకుండా, రక్షణ వ్యవస్థలో మెరుగుదల కొరకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రిపోర్టు ప్రకారం, ఈ ప్రమాదం తర్వాత హెలికాప్టర్, విమానాల నిర్వహణకు సంబంధించి రక్షణ శాఖ మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక శిక్షణ, నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయడం ద్వారా ఇలాంటి ప్రమాదాలు నివారించేందుకు చర్యలు తీసుకుంటామని రక్షణ శాఖ ప్రతినిధులు పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates