రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం ఆర్థిక రంగంలో తీవ్ర చర్చకు దారితీసింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో తగ్గింపు సిగ్నల్స్ ఇచ్చినప్పటికీ, భారత రూపాయి క్షీణత ఆగలేదు. పెట్టుబడుల లోటు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు కరెన్సీపై అదనపు ఒత్తిడి తెచ్చాయి.
గత కొన్ని నెలలుగా రూపాయి విలువ సార్వత్రికంగా పడిపోతోంది. రూ. 83 నుంచి రూ. 84కి క్షీణించడానికి 14 నెలల సమయం పట్టింది. అయితే, కేవలం రెండు నెలల్లోనే రూ. 84 నుంచి రూ. 85కు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. డాలర్ బలపడటం, భారతీయ మార్కెట్‌లో పెట్టుబడుల తగ్గుదల రూపాయి మారకం విలువపై ప్రభావం చూపాయి. ఇతర ఆసియా దేశాల కరెన్సీలకూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కొరియన్ వొన్, మలేసియా రిగ్గిట్, ఇండోనేషియా రుపయా 0.8 శాతం నుంచి 1.2 శాతం వరకు క్షీణించాయి.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు మిశ్రమంగా ఉండటంతో ఇతర దేశాల కరెన్సీలపై కూడా ప్రభావం పడింది. రూపాయి విలువ మరింతగా పడిపోకుండా నిలిపేందుకు ఆర్బీఐ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డాలర్‌తో పోలిస్తే భారత కరెన్సీ యొక్క స్థిరత్వాన్ని పునరుద్ధరించేందుకు మౌలిక మార్పులు అవసరమని సూచిస్తున్నారు. రూపాయి విలువ పతనంతో దిగుమతులు మరింత ఖరీదవుతాయని, ఇది విస్తృతమైన ఆర్థిక ప్రభావాలకు దారితీసే అవకాశం ఉందని వారంటున్నారు.