ధోనీ జీతం కన్నా గుకేశ్ కట్టే ట్యాక్సే ఎక్కువ?

భారత యువ గ్రాండ్ మాస్టర్, తెలుగు తేజం దొమ్మరాజు గుకేశ్‌ వరల్డ్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి రూ. 11.34 కోట్ల భారీ క్యాష్ ప్రైజ్ దక్కించుకున్నాడు. దాంతోపాటు, 3 మ్యాచ్‌లు గెలిచినందుకు రూ. 5.04 కోట్ల నగదు బహుమతి లభించింది. దీంతో, భారత ప్రభుత్వానికి రూ. 4.67 కోట్ల ట్యాక్స్ చెల్లించబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే ధోనీ ఐపీఎల్-2025 లో దక్కించుకున్నదానికన్నా గుకేశ్ ఎక్కువ ట్యాక్స్ కడుతున్నారని సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి.

2025 ఐపీఎల్ వేలంలో అన్ క్టాప్డ్ ప్లేయర్‌గా ధోనీని సీఎస్‌కే రూ. 4 కోట్లకు రిటెయిన్ చేసుకుంది. ఐదేళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న ఇండియన్ ప్లేయర్ ను అన్ క్యాప్డ్ గా పరిగణించాలన్నది ఐపీఎల్ నిబంధన. ఈ నేపథ్యంలోనే ధోనీకి చెన్నై యాజమాన్యం చెల్లించిన దానికంటే గుకేశ్ చెల్లించే పన్ను ఎక్కువ అంటూ సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.

అతి చిన్న వయసులో వరల్డ్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచిన వ్యక్తిగా గుకేశ్ చరిత్రపుటలకెక్కాడు.అయితే, డబ్బుల కోసం తాను చెస్ ఆడటం లేదని, చెస్ అంటే తనకు పిచ్చి అని గుకేశ్ చెబుతున్నాడు. అయితే, తాను చెస్‌లోకి వచ్చిన కొత్తలో కుటుంబం ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పడిందని, ఈ ప్రైజ్‌మనీతో సౌకర్యవంతంగా జీవిస్తామని అన్నారు.