న్యూ బౌలర్ పై రోహిత్ సెటైర్ !

భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ గబ్బా వేదికగా మూడో టెస్టు మ్యాచ్‌లో తలపడుతోన్న విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవడం కష్టమే అనిపిస్తోంది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ లను అడ్డుకోవడంలో భారత బాలర్లు చెమటోడ్చారు. భారత బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా తప్పితే మిగతా వారు అంతగా ప్రభావం చూపలేదు.

బుమ్రా ఆరు వికెట్లు తీసి ఆసీస్ బ్యాటింగ్‌ను కొంతవరకు కట్టడి చేశాడు. మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీయగా, నితీశ్ రెడ్డి, ఆకాశ్ దీప్ ఒక్కొక్క వికెట్ తీశారు. అయితే, యువ బౌలర్ ఆకాశ్ దీప్ ప్రదర్శన పట్ల కెప్టెన్ రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ ఘట్టం స్టంప్ మైక్ ద్వారా బయటకు వచ్చి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆసీస్ బ్యాటర్ అలెక్సీ కేరీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆకాశ్ దీప్ వేసిన 114వ ఓవర్‌లో బంతిని వికెట్లకు దూరంగా విసరడం రోహిత్ శర్మకు చిరాకు వచ్చేసింది.

వికెట్లకు సమీపంలో బంతిని విసరాల్సిన చోట అడ్డంగా విసరడం వల్ల కీపర్ రిషబ్ పంత్ అదనంగా కష్టపడి బంతిని అందుకోవాల్సి వచ్చింది. ఈ ఘటనతో రోహిత్ ఒక్కసారిగా ఆగ్రహంతో ఆకాశ్ దీప్‌ను ఉద్దేశించి “నీ బుర్రలో ఏమైనా ఉందా?” అంటూ సెటైర్ వేసాడు. ఈ వ్యాఖ్యలు స్టంప్ మైక్స్ ద్వారా రికార్డై సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. యువ బౌలర్‌పై ఈ విధంగా వ్యాఖ్యానించడం తగునా? అని కొందరు ప్రశ్నిస్తుండగా, కెప్టెన్ పాత్రలో రోహిత్ బౌలింగ్ లైనుపై ప్రశ్నించడం సహజమని మరికొందరు సమర్థిస్తున్నారు.

ఇక ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగుల భారీ స్కోర్ సాధించగా, టీమిండియా బ్యాటింగ్ విభాగం తీవ్రంగా దెబ్బతింది. శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, యశస్వీ జైస్వాల్, రిషబ్ పంత్ తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ప్రస్తుతం కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ క్రీజులో ఉండగా, భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 51 పరుగుల వద్ద నిలిచింది.