అది 1960 ప్రాంతం.. ఓరోజు సాయంత్రం.. “అందరూ తబలా వాయిస్తారు. నువ్వేంటి ప్రత్యేకం”- ఇదీ.. 15 ఏళ్ల వయసులో తన తండ్రి నుంచి వచ్చిన సూటి ప్రశ్న. దీనికి కారణం.. చదువును అశ్రద్ధ చేస్తున్నారని.. తబలాకే సమయం కేటాయిస్తున్నారన్నది ఓ తండ్రిగా ఆయన ఆవేదన. ఇదే.. ఆ యువకుడిలో కసి రేపింది. తబలా వాయిద్యాన్ని త..’భళా’ అని పించేస్థాయిలో ప్రపంచ ప్రసిద్ధం చేశారు. నిజానికి అప్పటికి జంతు చర్మలాలతో చేసిన వాద్య పరికరాలకు ప్రపంచ దేశాల్లో ఆదరణ లేదు. అసలు వాటి గురించి కూడా తెలియదు.
కేవలం డ్రమ్స్ మాత్రమే ప్రపంచ దేశాలకు తెలుసు. అలాంటి ప్రపంచ దేశాలు.. ‘ఈ తబలా వాద్యం మాది’- అని అనేంత స్థాయికి ఉత్తరాది దివ్య సంగీత వాద్య పరికరం.. తబలాకు ప్రపంచ ప్రఖ్యాతి తీసుకువచ్చారు జాకిర్ హుస్సేన్. పుట్టింది.. మైనారిటీ ముస్లిం కుటుంబంలో అయినా.. ఆయన సుస్వరాలకు బానిసయ్యారు. త్యాగరాజ స్వామి కృతులంటే.. చెవి కోసుకుంటారు. చిన్న వయసులో తబలా కొని పెట్టమంటే.. తండ్రి ససేమిరా అన్నారు. అయినా.. ఆయన తన ప్రయత్నం వదులుకోలేదు.
ఇంట్లోని వంట పాత్రలనే చెరో చేతికింద వేసుకుని.. స్వరాలు పలికించిన.. నిత్యసాత్వికుడు.. సంగీత సాధకుడు జాకిర్ హుస్సేన్. ‘వాహ్ తాజ్’ అనే ఏకైక నినాదం.. ప్రకటనగా మారి.. ప్రపంచాన్ని చుట్టేసిన.. విషయం తెలిసిందే. తన తబలా ద్వారా.. అశేష సంఖ్యలో ప్రపంచ వ్యాప్త అభిమానులను సొంతం చేసు కున్న జాకిర్ హుస్సేన్.. ఇక లేరు. సోమవారం ఉదయం 6.45 నిమిషాలకు అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో అమరలోకానికి తరలిపోయారు.
1951, మార్చి 9న ముంబైలో జన్మించిన హుస్సేన్.. 12 ఏళ్ల వయసుకే.. తబలాలో అగ్రశ్రేణి బాల వాద్య కారుడిగా గుర్తింపు పొందారు. ఎలాంటి ప్రోత్సాహం లేదు. కుటుంబమా.. సంగీత నేపథ్యానికి కడు దూరం. అయినా.. లక్షిత లక్ష్యాన్ని సాధించడంలో ఆయన అలుపెరుగని కృషి చేశారు. వినయం.. విధేయత.. నేటికీ ఆయన విడిచి పెట్టని.. ఆయనతోపాటే సహజీవనం చేసిన ఆభరణాలు. తనకు ఏదో కావాలని ఆయన కోరుకోలేదు. కానీ, ఆయనను వెతుక్కుంటూ..అనేక పదవులు.. గౌరవాలు గుమ్మం ముందు వేచి ఉన్నాయి.
తీవ్ర అనారోగ్యంతో కొన్నాళ్లుగా బాధపడుతున్న హుస్సేన్.. 40 ఏళ్ల కిందటే అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడే ఓ ఇటాలియన్ అమెరికన్‌ను వివాహం చేసుకున్నారు. భారతీయ సంప్రదాయాలకు విలువ ఇచ్చే ఆయన.. ఇద్దరు కుమార్తెలను కూడా.. అదే పంథాలో పెంచారు. తాజాగా సోమవారం ఉదయం ఆయన గుండెపోటుతో చికిత్స పొందుతూ.. తుది శ్వాస విడిచారు. ఆయన లేరు.. కానీ, ఆయన తబలా స్వరాలు మాత్రం వినిపిస్తూనే ఉంటాయి. కాగా.. ‘ఉస్తాద్’ అనే గౌరవాన్ని ఆయనకు ఇచ్చింది.. చాలా మందికి తెలియదు. నాటి ప్రధాని ఇందిరా గాంధీ. ఇది సంగీత రంగంలోనే కాదు.. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఉత్తరాది ఇచ్చే అత్యద్భుత గౌరవం. షెహనాయి విద్యాంసులు.. బిస్మిల్లా ఖాన్‌కు కూడా.. ఉస్తాద్ బిరుదు ఉన్న విషయం తెలిసిందే.