పాకిస్థాన్ వేదికగా 2025లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై మరోసారి వివాదం చెలరేగింది. భారత ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేస్తూ, పాకిస్థాన్‌లో భద్రతా పరిస్థితులు సరిగాలేవని, టీమిండియా అక్కడ ఆడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని తాము పూర్తిగా సమర్థిస్తున్నామని పేర్కొన్నారు.
బీసీసీఐ ఇప్పటికే పాకిస్థాన్‌లో మ్యాచ్‌లు ఆడటం సాధ్యమని చెప్పలేదని గుర్తు చేశారు. ఇక భారత్ జట్టు పాకిస్థాన్ వెళ్లడం సాధ్యంకాదన్న ఈ ప్రకటన ఐసీసీ కీలక సమావేశం ముందు వచ్చినట్లు తెలిపారు జైస్వాల్ వివరించారు. ఈ సమావేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్, వేదికలపై చర్చ జరుగుతుందని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో, హైబ్రిడ్ మోడల్ ద్వారా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ ప్రస్తావనకు వస్తోంది.
ఈ మోడల్ ప్రకారం, కొన్ని మ్యాచ్‌లను పాకిస్థాన్‌లో, మరికొన్ని ఇతర దేశాల్లో నిర్వహిస్తారు. గతంలో ఆసియాకప్ కూడా హైబ్రిడ్ మోడల్‌లో జరిగింది. అయితే, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం తమ వేదికను వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. భారత్ చెప్పినట్లు మేము నడుచుకోవాలా అన్నట్లే వ్యవహరిస్తోంది.
మరోవైపు భారత్ పాల్గొనకపోతే టోర్నమెంట్ ఆకర్షణ తగ్గుతుందని ఐసీసీ అధికార వర్గాలు భావిస్తున్నాయి. పీసీబీ మాత్రం ఇది తమ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అని, హైబ్రిడ్ మోడల్‌కు సహకరించబోమని స్పష్టంచేసింది. ఈ పరిస్థితుల్లో, వాయిదా పడనున్న ఐసీసీ సమావేశం మరింత ఆసక్తికరంగా మారింది. మరి ఫైనల్ గా ఈ విషయంలో ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.