బెయిల్ ర‌ద్దు చేయ‌మంటారా?

క‌డ‌ప ఎంపీ, వైసీపీ నాయ‌కుడు వైఎస్ అవినాష్‌రెడ్డి తండ్రి, వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసులో ఆరోప ణ‌లు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది బెయిల్ ర‌ద్దు చేయ‌మం టారా? సీబీఐ వాద‌న‌ల‌పై మీరు ఏం చెబుతారు? అని సుప్రీంకోర్టు నిల‌దీసింది. ఈ మేర‌కు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు కేసు విచార‌ణ‌ను వ‌చ్చే ఏడాది మార్చికి వాయిదా వేసింది.

ఏం జ‌రిగింది..?వైసీపీ అధినేత జ‌గ‌న్ బాబాయి.. వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న అవినాష్‌రెడ్డి తండ్రి భాస్క‌ర‌రెడ్డిని గ‌తంలోనే సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. దీంతో ఆయ‌న కొన్నాళ్లు చెంచ‌ల్‌గూడ జైల్లో ఉన్నారు. అయితే.. త‌న ఆరోగ్యం బాగోలేద‌ని, తాను ఎవ‌రినీ ప్ర‌లోభాల‌కు గురి చేయ‌న‌ని, సాక్ష్యుల‌ను బెదిరించ‌న‌ని చెబుతూ.. ఆయ‌న బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేసుకున్నారు. దీనిని విచారించిన తెలంగాణ హైకోర్టు భాస్క‌రరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది.

అయితే.. ఈ బెయిల్‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ..ఇటీవ‌ల సీబీఐ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ఈ పిటిష‌న్‌పై శుక్రవారం సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్‌ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలోనే బెయిల్ ర‌ద్దు చేయాలా? అని అడుగుతూ.. భాస్క‌ర‌రెడ్డి త‌ర‌ఫు న్యాయ‌వాదిని ప్ర‌శ్నించింది. ఈ నేప‌థ్యంలో న్యాయ‌వాది స్పందిస్తూ.. దీనిపై త‌మ‌కు స‌మ‌యం ఇవ్వాల‌ని కోరారు. దీంతో నోటీసులు జారీ అయ్యాయి. దీనిపై భాస్క‌ర‌రెడ్డి వ‌చ్చేఏడాదిమార్చి నాటికి సుప్రీంకోర్టుకు స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది.