ఐపీఎల్‌లో ఈ రెండు జట్లను ఆపేదెవరు?

ప్రతి ఏడాదీ ఇండియన్ ప్రిమియర్ లీగ్ ఆరంభానికి ముందు ఈసారి టైటిల్ ఫేవరెట్లు ఎవరు అనే చర్చ వస్తుంది. కొన్ని జట్ల మీద అభిమానులకు భారీ అంచనాలుంటాయి. కొన్ని జట్లను తీసి పడేస్తుంటారు. టోర్నీ ఆరంభమయ్యాక కొన్నిసార్లు అంచనాలకు తగ్గట్లే జట్ల ప్రదర్శన ఉంటుంది. కొన్నిసార్లు అంచనాలు తల్లకిందులు అవుతుంటాయి.

ఈ సీజన్ విషయానికి వస్తే.. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ మీదే అందరికీ ఎక్కువగా గురి కనిపించింది. రెండేళ్ల కిందట జట్టును మార్చి యువ రక్తం ఎక్కించినప్పటి నుంచి మెరుగైన ప్రదర్శన చేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ మీద కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ప్రస్తుత టోర్నీలో ఈ రెండు జట్లూ అదరగొడుతున్నాయి.

ప్రస్తుతం టోర్నీలో ఈ రెండు జట్లదే ఆధిపత్యం కూడా. పాయింట్ల పట్టికను గమనిస్తే ఏ జట్టు ప్రదర్శనా మరీ తీసికట్టుగా లేదు. ఒక జట్టు వేస్ట్ అనుకోగానే తర్వాతి మ్యాచ్‌లో ఆ జట్టు అదరగొడుతోంది. ఈ జట్టుకు తిరుగులేదు అనుకున్న జట్టు ఉన్నట్లుండి ఓడిపోతోంది. ముందు రాజస్థాన్‌ను అందరూ తేలిగ్గా తీసుకున్నారు. ఆ జట్టు వరుసగా రెండు భారీ విజయాలతో ఫేవరెట్లలో ఒకటిగా మారింది.

కానీ తర్వాత అంచనాలు పెంచుకున్నాక వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయింది. ముంబయిని ఓడిస్తూ టోర్నీలో శుభారంభం చేసిన చెన్నై.. ఆ తర్వాత మూడు మ్యాచుల్లో వరుసగా ఓడిపోయి వేస్ట్ అనిపించింది. కానీ గత మ్యాచ్‌లో 179 పరుగుల లక్ష్యాన్ని ఒక్కటంటే ఒక్క వికెట్ కోల్పోకుండా ఛేదించి ఔరా అనిపించింది. బెంగళూరును మొదట్లో అందరూ తీసి పడేశారు కానీ.. ఆ జట్టు నాలుగు మ్యాచుల్లో మూడు గెలిచేసింది. అది ఓడించిన జట్లలో ముంబయి కూడా ఉండటం విశేషం. కానీ గత మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో చిత్తుగా ఓడిపోయింది.

ఇలా ఈ ఐపీఎల్‌ అంచనాలకు అందని విధంగా సాగుతోంది. ప్లేఆఫ్ రేసు రసవత్తరంగా ఉండబోతోందనడానికి ఇది సంకేతం. ఐతే ఇంత అనిశ్చితిలోనూ రెండు జట్ల ప్రదర్శన మాత్రం వావ్ అనిపిస్తోంది. ఆ రెండు జట్లు ప్లేఆఫ్‌కు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే ఫైనల్‌కు చేరినా, రెంటిలో ఒకటి కప్పు ఎగరేసుకుపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ రెండు జట్లే ముంబయి, ఢిల్లీ.

మిగతా జట్లతో పోలిస్తే వీటికున్న బలం.. ఎక్కువమంది ఆటగాళ్లు ఫామ్ చాటుతుండటం.. ఓపెనర్లలో ఎవరో ఒకరు ప్రతి మ్యాచ్‌లోనూ క్లిక్ అవుతుండటం.. డీప్ బ్యాటింగ్ లైన్ ఉండటం.. అన్నింటికీ మించి బౌలింగ్‌ చాలా పటిష్టంగా కనిపిస్తుండటం. ఒక ఛాంపియన్ జట్టుకు ఉండాల్సిన అన్ని లక్షణాలూ వీటిలో ఉన్నాయి. ఏ ఒక్కరి మీదో ఆధారపడే పరిస్థితి లేకుండా చాలామంది మ్యాచ్ విన్నర్లు ఉన్న ఈ జట్లను మిగతా టీమ్స్ అడ్డుకోవడం కష్టంగానే ఉంది.