ఐపీఎల్ మెగా వేలంలో అందరి దృష్టిని ఆకర్షించిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు క్రికెట్ వరల్డ్ లో హాట్ టాపిక్ గా మారింది. అత్యంత పిన్న వయస్కుడిగా రాజస్థాన్ రాయల్స్‌కు ఎంపికైన వైభవ్ రూ.30 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి అడుగుపెట్టగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు పోటీ పడ్డాయి. చివరికి రాజస్థాన్ అతడిని రూ.1.10 కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ ఎంపిక వెనుక ఉన్న అసలు కారణాలను వెల్లడించారు. “సెలెక్షన్ ట్రయల్స్‌లో వైభవ్ తన ప్రతిభతో అద్భుతంగా రాణించాడు. అతడి ఆటలో ఉన్న నైపుణ్యం, క్రమశిక్షణ మనకు ఆహ్లాదకరంగా అనిపించాయి. ఈ వయసులోనే అతడిలో ఉన్న టాలెంట్‌ను చూసి అతడిని జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నాం,” అని ద్రవిడ్ తెలిపారు.
వైభవ్ తండ్రి సంజీవ్ మాట్లాడుతూ, “ప్రస్తుతం అతడు అండర్-19 ఆసియా కప్ కోసం దుబాయ్‌లో ఉన్నాడు. నాగ్‌పూర్‌లో జరిగిన ట్రయల్స్‌లో అతడు ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ సూచన మేరకు ఒకే ఓవర్‌లో 17 పరుగులు చేయాలని టార్గెట్ ఇవ్వగా, అతడు మూడు సిక్సర్లు బాది దాన్ని సునాయాసంగా సాధించాడు,” అన్నారు.
వైభవ్ వయసు విషయంలో వస్తున్న ఆరోపణలను ఆయన తండ్రి ఖండించారు. “అతడు 13 ఏళ్ల వయస్కుడే. ఈ వయసును నిర్ధారించడానికి బీసీసీఐ నిర్వహించిన ఎముక పరీక్షల్లోనూ ఇదే స్పష్టమైంది. ఇంకా అనుమానాలు ఉంటే మరలా పరీక్షించవచ్చని,” ఆయన తెలిపారు. వైభవ్ భవిష్యత్తు ఇప్పుడు ఐపీఎల్ ద్వారా మరింత వెలుగులోకి రానుంది. చిన్న వయసులోనే ఈ స్థాయిలో ఆహ్వానం పొందడం అతడికి గొప్ప అవకాశమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి అతను రాబోయే రోజుల్లో ఏ విదంగా ఆకట్టుకుంటాడో చూడాలి.