అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉన్న భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. బారీ విల్మోర్ కూడా అమెతోనే ఉన్నారు. అయితే ఫోటోలో సునీతా బలహీనంగా, బరువు తగ్గినట్లు కనిపించడం అందరినీ ఆందోళనకు గురి చేసింది. సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ కావడంతో ఆరోగ్యం విషయంలో చర్చ మొదలైంది.
ఈ నేపథ్యంలోనే అమెరికాకు చెందిన శ్యాసకోశ నిపుణుడు డాక్టర్ వినయ్ గుప్తా సునీతా పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, అందువల్లే బలహీనంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. ఇంతటి చర్చ జరుగుతుండగా, సునీతా ఆరోగ్యం గురించి నాసా అధికారిక ప్రకటన చేసింది. ఐఎస్ఎస్‌లో ఉన్న సునీతా సహా ఇతర వ్యోమగాములంతా పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, ఎలాంటి ప్రమాదం లేదని నాసా స్పష్టం చేసింది.
అంతేకాదు, అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, వారి ఆరోగ్యం పర్యవేక్షణలో ఫ్లైట్ సర్జన్లు ఉంటారని వెల్లడించింది. అంతరిక్షంలో మారే శరీర పరిస్థితులను గమనిస్తూ పోషకాహారం విషయంలో నిపుణుల సూచనలు పాటిస్తున్నారని కూడా నాసా తెలియజేసింది. సునీతా విలియమ్స్ ఆరోగ్యం గురించి వస్తున్న ఊహాగానాలపై నాసా స్పందించడంతో, ఆందోళనకు చెక్ పడింది.
భూమిపైకి వచ్చేది ఎప్పుడు?
స్పేస్ఎక్స్ క్రూ-9 మిషన్ భాగస్వాములైన వీరిద్దరూ భూమికి తిరిగి రావాలని భావించినప్పటికీ పలు సాంకేతిక లోపల వలన రాలేని పరిస్థితి, తాజా నివేదికల ప్రకారం కనీసం 2025 ఫిబ్రవరి వరకు వారు ఇస్ఎస్ఎస్‌లోనే ఉండవలసి రావచ్చు. అయితే దీర్ఘకాలం అంతరిక్షంలో ఉండడం వల్ల వ్యోమగాములు ఎముకల సాంద్రత, కండరాల బలం కోల్పోవడం, శరీర కొవ్వు తగ్గడం వంటి సమస్యలను ఎదుర్కొంటారని నిపుణులు చెబుతున్నారు.