అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫైర్ బ్రాండ్ నాయకుడు.. 78 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ విజయతీరాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇకపై అమెరికన్లు స్వర్ణయుగం చూస్తారని అన్నారు. ఇలాంటి విజయాన్ని అమెరికా ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. ‘నా గెలుపు కోసం రిపబ్లికన్లు బాగా కష్టపడ్డారు. అమెరికాకు పూర్వవైభవం తీసుకొస్తా. అమెరికన్ల కష్టాలు తీరబోతున్నాయి. ఇంతటి ఘన విజయం అందించిన వారికి నా ధన్యవాదాలు. ఇది అమెరికన్లు అందరూ గర్వించే సమయం’ అని ఆయన పేర్కొన్నారు.
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఫ్లడ్ లైట్ల వెలుగులో ఇంకా కొనసాగుతోంది. ముఖ్యంగా స్వింగ్(ఎప్పుడు ఎటు మొగ్గుతారో చెప్పడం కష్టంగా భావించే రాష్ట్రాలు) రాష్ట్రాల్లో అయితే.. తొలుత టఫ్‌గా సాగినఫైట్.. తర్వాత.. ఏకపక్షంగా మారిపోయింది. ఇక్కడి ప్రజలు ట్రంప్ వైపే మద్దతుగా నిలిచారు. దీంతో దాదాపు ట్రంప్ విజయం ఖాయమని తేలిపోయింది. ఈ పరిణామాలతో తన భార్య, కుమారుడి తో సహా.. బయటకు వచ్చిన ట్రంప్.. రిపబ్లికన్ పార్టీ నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ ఎన్నికలను తనకంటే ఎక్కువగా చాలా మంది ప్రతిస్టాత్మకంగా తీసుకున్నారని చెప్పారు. ఈ విషయం లో ప్రతి ఒక్క రిపబ్లికన్ పార్టీ అభ్యర్థికీ పాత్ర ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి సాధించిన విజయమని తెలిపారు. అమెరికాను ముందుకు నడిపించే బాధ్యతను తన భుజాలపై పెట్టారని.. ఈ బాధ్య తను తాను సగర్వంగా స్వీకరిస్తున్నానని చెప్పారు. తన విజయంలో తన కుటుంబం పాత్ర సహా.. సోషల్ మీడియా దిగ్గజం ఎలాన్ మస్క్ పాత్ర ఎంతో ఉందని కొనియాడారు.
మోడీ శుభాకాంక్షలు..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయతీరాలకు చేరిన ట్రంప్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం భారత్-అమెరికా బంధాన్ని మరింతద్రుఢతరం చేస్తుందని అభిప్రాయ పడ్డారు. అమెరికా ఫస్ట్ నినాదంతో ముందుకు సాగిన ట్రంప్ విజయం ఆదేశ విజయమని పేర్కొన్నారు. అభివృద్ధి వైపు ప్రజలు నిలబడతారనడానికి ఈ ఎన్నికల సజీవ సాక్ష్యమని కూడా మోడీ తెలిపారు.