న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో రిషభ్ పంత్ ఆడిన విధానం ఫ్యాన్స్ కు మంచి కిక్కిచ్చింది. స్వల్ప లక్ష్యం కోసం భారత్ పీకల్లోతు కష్టాల్లో ఉన్న వేళ, పంత్ ఒక్కడే గట్టిగా నిలబడ్డాడు. 64 పరుగులు చేయడానికి కేవలం 57 బంతులు మాత్రమే తీసుకున్న పంత్, తన ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో రాణించాడు. ఈ సమయంలో భారత టాప్ ఆర్డర్ దారుణంగా విఫలమైందే గాక, మ్యాచ్ పంత్ ఒక్కడిపై ఆధారపడి ఉండిపోయింది.
కానీ, అజాజ్ పటేల్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్‌గా డిక్లేర్ అయ్యాడు. ముందుగా ఫీల్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినప్పటికీ, న్యూజిలాండ్ కెప్టెన్ డీఆర్‌ఎస్ కోరడంతో చర్చ మొదలైంది. రివ్యూ ద్వారా బంతి బ్యాట్ అంచు తాకినట్లు స్పష్టమైంది. కానీ అదే సమయంలో పంత్ బ్యాట్ ప్యాడ్‌ను తాకినట్లు వాదన లేకపోలేదు. పంత్ దీనిపై ఫీల్డ్ అంపైర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, థర్డ్ అంపైర్ మాత్రం ఔట్‌గా ప్రకటించాడు.
ఈ నిర్ణయం పట్ల అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంతి ప్యాడ్లను మాత్రమే తాకిందని, బ్యాట్‌ను తాకలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత అభిమానులు డీఆర్‌ఎస్ వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. పంత్ నిరాశతో పెవిలియన్‌కు చేరి తన అసంతృప్తిని చూపాడు. ఈ ఔట్‌తో న్యూజిలాండ్ బౌలర్ అజాజ్ పటేల్ ఐదు వికెట్ల ఘనతను రెండవ ఇన్నింగ్స్‌లోనూ సాధించాడు.