వారెన్ బఫెట్ ఖాతాలో మరో సారి భారీగా పెరిగిన డాలర్లు!

ప్రపంచ ప్రఖ్యాత స్టాక్ మార్కెట్ దిగ్గజం వారెన్ బఫెట్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచ మార్కెట్ లో అతని మాట కూడా ఒక శాసనం. మార్కెట్ ను ప్రభావం చేసే అతికొద్ది మంది వ్యక్తులలో ఈయన ఒకరు. ఇక బఫెట్‌ స్థాపించిన బెర్క్‌షైర్ హాథవే సంస్థ ప్రస్తుతం 325 బిలియన్ డాలర్లకు పైగా నగదును తన ఖాతాలో నిల్వ ఉంచుకున్నట్లు తెలుస్తోంది. 

ఈ ఏడాది బెర్క్‌షైర్ తన భారీ పెట్టుబడులను క్రమంగా విక్రయించడం వల్ల ఈ మొత్తం నగదు జమ అయింది. ముఖ్యంగా యాపిల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి దిగ్గజ సంస్థల్లో ఉన్న షేర్లను విక్రయించడం ద్వారా మరింత నగదు సమకూరింది. యాపిల్ సంస్థలో గత సంవత్సరం చివరిలో 174.3 బిలియన్ డాలర్ల విలువైన వాటాలను బఫెట్‌ బెర్క్‌షైర్ హాథవే సొంతం చేసుకుంది. 

అయితే ఈ ఏడాది జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో యాపిల్ షేర్లను భారీగా విక్రయించడంతో, ఈ మొత్తం 69.9 బిలియన్ డాలర్లకు తగ్గిపోయింది. ఈ షేర్ల విక్రయంతో భారీ మొత్తం నగదు రూపంలో నిలిచింది. ఇంకా, బ్యాంక్ ఆఫ్ అమెరికాలోనూ బెర్క్‌షైర్ కొన్ని వాటాలను విక్రయిస్తూ నగదు నిల్వను పెంచుకుంది. 

మొత్తం ఆస్తులను నగదు రూపంలో నిల్వ ఉంచడం ద్వారా, భవిష్యత్తులో మరింత లాభదాయకమైన పెట్టుబడుల కోసం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బెర్క్‌షైర్ హాథవే యొక్క ఆదాయం అనుకున్నంత భారీగా మారలేదు. గత ఏడాది 93.21 బిలియన్ డాలర్ల ఆదాయం నమోదు చేసిన ఈ సంస్థ, ఈ ఏడాది 92.995 బిలియన్ డాలర్లను ప్రకటించింది. దీంతో బెర్క్‌షైర్ యొక్క ఆదాయ మార్గాలు స్థిరంగా ఉన్నా, సంస్థలోని కీలక పెట్టుబడుల విక్రయం ద్వారా నిల్వలు పెరుగుతున్నాయి.